మధిర: మధిరలోని వైరా నదిలో మట్టి తవ్వకాలు ఆగలేదు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పేరిట అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించాక శివాలయం వైపు ఉన్న లోతట్టును మట్టితో నింపాలి. అయితే, మట్టిని బయట కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో నది మధ్యలో నుంచి లోతైన గుంతలు తవ్వి టిప్పర్లలో మట్టి తరలిస్తున్నారు. ‘భట్టి ఇలాఖాలో మట్టి దందా’శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితంగా ఒకరోజు తవ్వకాలు నిలిపివేశారు. ఆ తర్వాత మరీ లోతుగా కాకుండా ౖపైపెన తవ్వి కావాల్సిన మట్టి తీసుకెళ్లాలని అధికారులే సూచించినట్లు తెలిసింది. దీంతో తవ్వకాలు, మట్టి తరలింపు కొనసాగుతున్నాయి. ఈ విషయమై ఈఈ మధును ఆరా తీయగా.. రిటైనింగ్ వాల్ తవ్వగా వచ్చిన మట్టిని పక్కన వేశారని, తిరిగి అదే మట్టి తీసుకెళ్తున్నారని చెప్పడం గమనార్హం. మరోపక్క రాయపట్నం పొలిమేరలో వైరా నది ఒడ్డు నుంచి బుధవారం అక్రమంగా మట్టి తరలించారు. అనుమతి లేకుండానే పొక్లెయినర్‌తో మట్టి తవ్వి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలించడం కనిపించింది.


