ప్రతికూలమేనా ?! | - | Sakshi
Sakshi News home page

ప్రతికూలమేనా ?!

Jul 13 2026 12:10 AM | Updated on Jul 13 2026 12:10 AM

ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరుణుడి కరుణ కరువు

‘ఎల్‌నినో’ ప్రభావంతో

జిల్లాలో లోటు వర్షపాతం

నాటిన చేన్లలో వడబడుతున్న మొక్కలు

కాలం గడుస్తున్నా ఊపందుకోని

పంటల సాగు

జిల్లాపై వరుణుడి కటాక్షం కరువైంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఎల్‌నినో పరిస్థితులతో ఎండలు వేసవిని తలపిస్తుండగా.. పంటల సాగుకు వాతావరణం సహకరించడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వేసిన పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం అన్నదాతలను అయోమయంలో పడేస్తోంది. – ఖమ్మంవ్యవసాయం

కనీస వర్షం కరువు...

జూన్‌ సాధారణ వర్షపాతం 203 మి. మీ.కు గాను 168.9 మి.మీ.లే నమోదైంది. ఇక ఈనెల వర్షపాతం 241 మి. మీ.గా అంచనా వేస్తే 11వ తేదీ నాటికి కేవలం 20.1 మి.మీ.గా నమోదు కావడం గమనార్హం. రెండు నెలలు కలిపి 57.4 శాతం లోటు నమోదైంది. జిల్లాలోని 21 మండలాలకు గాను కారేపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, సత్తుపల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం మండలాలు లోటు వర్షపాతంలో ఉండగా, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, తల్లాడ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం ముదిగొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మండుతున్న ఎండలు

వర్షాలు లేకపోగా కొద్దిరోజులుగా నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. వర్షాలతో చల్లని వాతావరణం ఉండాల్సిన జూలైలో అందుకు భిన్నమైన పరిస్థితి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన వేసవిలో 40 – 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రస్తుతం 35 – 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఓ పక్క వాన లేక.. ఇంకోపక్క ఉష్ణోగ్రతల ప్రభావం పంటల సాగుపై పడుతోంది.

చేతికి వస్తాయా?

జూన్‌లో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, అపరాల పంటలు సాగు చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితి అనుకూలించక పత్తితో పాటు పెసర, కంది వంటి పంటలు బెట్టకేశాయి. పత్తి పైరు ఎదుగుదల లోపించి, పెసర పైర్లు వడబడుతున్నాయి. పొడి దుక్కుల్లో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక, రెండోసారి నాటినప్పటికీ భూమిని చీల్చుకుని మొక్క రావడం లేదు. సహజంగా జూలై రెండో వారం కల్లా జిల్లాలో పత్తి సాగు లక్ష్యాన్ని చేరాల్సి ఉండగా.. సాధారణ సాగు 2,36,908 ఎకరాలకు గాను ఇప్పటివరకు 2,08,277 ఎకరాల్లోనే నాటారు. మరోపక్క పెసర, మొక్కజొన్న, చెరకు, కంది, వేరుశనగ వంటి పంటల సాగు కూడా నామమాత్రంగానే ఉంది.

ఊపు లేని వరిసాగు

జిల్లాలో ప్రధాన పంట అయిన వరి జూలై వచ్చిందంటే ఊపందుకోవాలి. ప్రధాన నీటివనరు అయిన సాగర్‌లోకి నీరు చేరితే వరి సాగు లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. కానీ ఎల్‌నినో ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,05,366 ఎకరాలకు ఇప్పటి వరకు కేవలం 18,166 ఎకరాల్లో నాట్లు వేశారు. బోర్లు, బావుల సౌకర్యం ఉన్న వారు మరో 64,436 ఎకరాలకు వరినార్లు సిద్ధం చేసుకున్నా వానలు లేకపోవడంతో వడబడుతున్నాయి.

ఈ వాతావరణంలో ప్రత్యామ్నాయ పంటలైన అపరాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వడబడుతున్న మొక్కల రక్షణకు యూరియా ద్రావకం, నానో యూరియాను అధికారుల సూచనల మేరకు పిచికారీ చేస్తే 15 రోజులు కాపాడుకోవచ్చు.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement