● రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం ● ప్రస్తుతానికి చెరువులు నింపుతున్న అధికారులు ● మూడు, నాలుగు రోజుల్లో సాగుకు విడుదలపై నిర్ణయం
పెనుబల్లి: భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదలైన గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు చేరగా.. అక్కడి నుంచి ఎన్నెస్పీ కాల్వల్లో పరవళ్లు తొక్కుతూ ఆదివారం పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టుకు చేరాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో సందిగ్ధత నెలకొన్న సమయాన ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరడంతో ఆనందం వ్యక్తమవుతోంది.
నియోజకవర్గంలో కీలకం
సత్తుపల్లి నియోజకవర్గంలోనే లంకాసాగర్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుగా నిలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎన్నెస్పీ కాల్వకు 52వ కిలోమీటర్ వద్ద వదలగా.. అక్కడి నుంచి వేంసూరు మండలంలోని ఏపీ సరిహద్దు 101 కి.మీ. రెగ్యులేటర్ వరకు చేరాయి. ఆపై సాగర్ కాల్వ పరిధిలోని తెలంగాణ పరిధి చెరువుల్లో నీరు నింపేలా జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, గత ఏడాది జూలై 12 నాటికి లంకాసాగర్ ప్రాజెక్టులో 8.2 అడుగుల నీటిమట్టం ఉండగా, 2024 జూలై 12న 10 అడుగులుగా ఉంది. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో కేవలం 4.10 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులతో 0.31 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించారు. ఈమేరకు లంకాసాగర్‌లోకి గోదావరి జలాలు చేరుతుండగా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఎన్నెస్పీ పరిధి చెరువులను నింపే పనులను జల వనరుల శాఖ సీఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రామారావు, ఈఈ అర్జున్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం పెనుబల్లి మండలంలోని 16, వేంసూరు పరిధిలోని ఐదు చెరువులకు నీరు విడుదల చేస్తున్నామని.. ఈ జలాలు తాగునీటి అవసరాలకే కాక భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడతాయని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుండగా, సాగు అవసరాలకు విడుదలపై స్పష్టత వస్తుందని తెలిపారు.
మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
లంకాసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరుతుండడంపై వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు లింక్ కెనాల్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేయడమే కాక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి శేఖర రావు, తేళ్ల సురేష్, కొల్లి రాజాబాబు, చావా శేషయ్య, కొల్లి శ్రీనివాసరావు, గుంట్రు నాగరాజు, జొన్నలగడ్డ నాగేశ్వరరావు, మెరుగు వెంకటేశ్వర రావు, బోడ శ్రీనివాసరావు, బాదావత్ నాగేశ్వరరావు, రాచబంటి కృష్ణా రావు, కండె కృష్ణయ్య, సతీష్, రైతులు పాల్గొనారు. మరోపక్క సీతారామ ప్రాజెక్టు 80శాతం పనులు బీఆర్‌ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి జలాలు రావడానికి కేసీఆర్ చొరవే కారణమని చెబుతూ ఆయన చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు.


