● సమీక్షించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న సీతమ్మసాగర్ బ్యారేజీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సందర్శించనున్నారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో అమ్మగారిపల్లి గ్రామ సమీపంలోని ఎల్‌అండ్‌టీ హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట ఫ్యూజ్ పాయింట్ పరిశీలించి, సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులను సందర్శించనున్నారు. అనంతరం సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల వేగవంతం, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నేడు కేంద్ర మంత్రి పర్యటన
మణుగూరు టౌన్: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సోమవారం మణుగూరులో పర్యటించనున్నారు. పీకేఓసీ–2 గనిని సందర్శించడంతోపాటు గేట్ సమావేశంలో కార్మికులతో మాట్లాడనున్నారు. కాగా ఇటీవల తాడిచర్ల–2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు. మణుగూరు భవిష్యత్ దృష్ట్యా పీకేఓసీ డీప్ సైడ్‌ను సింగరేణికే కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
డీఎస్సీ–2003
ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలి
ఖమ్మం సహకారనగర్: డీఎస్సీ – 2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నందున మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, డీఏ చెల్లింపు, సీపీఎస్ విధానం రద్దు, ఆరోగ్య కార్డుల జారీపై ఇంకా తాత్సారం చేయొద్దని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈసమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోత్ రాందాస్, సురేష్, ధర్మసోత్ నాగేశ్వరరావు, గుగులోత్ రామకృష్ణ, షేక్ ఉద్దండ్ షరీఫ్, పెంట్యాల ప్రశాంతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ కోసం ఉద్యమిస్తాం..
బోనకల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు కోసం ఉద్యమిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు హెచ్చరించారు. బోనకల్‌లో ఆదివారం జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లయినా అమలులో అమలులో నిర్లక్ష్యంగా ఉందని, ఇకనైనా స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణతో పాటు చిన్న రంగారావు, నర్సింహారావు, గోపాల్‌రావు, కోటయ్య, నరేంద్రసింహా, నిర్మల, సౌభాగ్యలక్ష్మి, హరికృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


