శాంపిళ్లు సేకరిస్తాం..
అడిగే వారేరి?
● హోటళ్లు, స్వీట్‌స్టాళ్లలో తనిఖీలు అంతంతే.. ● ఖాళీగా గెజిటెడ్ అధికారి పోస్టు, సెలవులో ఎఫ్‌ఎస్‌ఓ ● ఇదే అదునుగా వసూళ్లలో సిబ్బంది?
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా ప్రజల ఆరోగ్యానికి భద్రత కరువైంది. రంగురంగుల లైట్లతో మెరిసిపోయే హోటళ్లు, ఆకట్టుకునే పేర్లతో ఏర్పాటవుతున్న బిర్యానీ సెంటర్లు, గల్లీకొకటి వెలుస్తున్న టిఫిన్ సెంటర్లు వినియోగదారుల జేబులను గుల్ల చేయడమే కాకుండా వారి ఆరోగ్యాలతోనూ చెలగాటమాడుతున్నాయి. ప్రజలకు కల్తీ లేని, నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన ఆహార తనిఖీ (ఫుడ్ సేఫ్టీ) శాఖను సిబ్బంది కొరత వేధిస్తుండగా.. హోటళ్లపై పర్యవేక్షణ కరువై వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది.
ఇన్‌చార్జితోనే..
జిల్లావ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సిన ఆహార తనిఖీ శాఖలో తీవ్రమైన శూన్యత కనిపిస్తోంది. కీలకమైన గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ అధికారి బదిలీ అయ్యాక ఎవరినీ నియమించలేదు. ఇక క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారి సైతం సుదీర్ఘ సెలవులో వెళ్లారు. దీంతో భద్రాద్రి జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. రెండు జిల్లాల బాధ్యతలతో ఎక్కడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ (డీఓ), అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పోస్టుల్లో ఇద్దరు అధికారులు ఇటీవలే చేరినా కార్యాలయ విధులతోనే వారికి సరిపోతోంది.
శాంపిళ్ల సేకరణ కూడా లేక..
హోటళ్లు, తయారీ కేంద్రాల నుంచి నిరంతరం శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపాలి. నిర్వహణ, ఆహార తయారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సీజ్ చేయడమే కాక జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అధికారుల కొరతతో తనిఖీలు నామమాత్రంగా కూడా జరగక.. రూ.1.50 కోట్ల విలువైన ‘రోడ్ ఆన్ సేఫ్టీ వీల్స్’వాహనం జిల్లాకు కేటాయించినా బయటకు తీసే నాథుడు లేక ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. జిల్లాకు పూర్తిస్థాయి గెజిటెడ్ అధికారిని నియమించడమే కాక ఇతర పోస్టులనూ భర్తీ చేస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా కానరావడం లేదు. అప్పటివరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతోనైనా ఆకస్మిక తనిఖీలు చేయిస్తే హోటళ్ల నిర్వాహకుల్లో మార్పు వచ్చే అవకాశముంది.
దోపిడీకి తెరలేపిన సిబ్బంది
కీలకమైన అధికారులు లేకపోవడంతో ఆహార తనిఖీ శాఖ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందితో ఇద్దరు నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి లైసెన్స్ ఉందా అని తీస్తూ, లేకపోతే తీసుకోవాలని చెబుతూనే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారని సమాచారం. అంతేకాక బదిలీ అయిన, సెలవులో వెళ్లిన అధికారుల లాగిన్ ఐడీతో ఇటీవల కొన్ని లైసెన్సులు జారీ చేయడం వెనుక సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలిసింది. మరోపక్క ఖమ్మంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఉంటే జరిమానా విధించాల్సిన కేఎంసీ శానిటేషన్ సిబ్బంది మామూళ్లు తీసుకొని వదిలేస్తున్నట్లు సమాచారం.
ఇక నుంచి ఖమ్మం జిల్లాలో రెగ్యులర్‌గా ఆహార శాంపిళ్ల సేకరణపై దృష్టి సారిస్తాం. రెండు జిల్లాల బాధ్యతలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందితోనే తనిఖీలు నిరంతరం చేపడుతాం. ప్రస్తుతానికి ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీ చేసి శాంపిళ్లు సేకరిస్తున్నాం.
–శరత్, ఇన్‌చార్జ్ ఆహార తనిఖీ అధికారి
జిల్లా కేంద్రంలోనే కాక మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో చిన్నాపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వేలాది గా ఉన్నాయి. వీటన్నింట్లో ఇన్‌చార్జ్ అధికారి నాణ్యతను ఎలా పర్యవేక్షిస్తారనేది ప్రశ్నగా మారింది. అడిగేవారు లేక పలు సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రిజ్‌ల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తూ ప్రజల డబ్బు, ఆరోగ్యంపై దెబ్బ కొడుతున్నారు. బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌లో నిషేధిత రంగులు, టేస్టింగ్ సాల్ట్ వినియోగం, వాడిన నూనె పదేపదే మరిగిస్తూ వాడుతుండడం సాధారణమైపోయింది.


