శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రైతు ఆశీర్వాద సభ’ విజయవంతం

ఖమ్మంమయూరిసెంటర్‌: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం జరిగిన రైతు ఆశీర్వాద సభ విజయవంతమైందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. కాగా, సభకు రైతులు, ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతీ ఒక్కరి సేవలు అభినందనీయమని కొనియాడారు.

రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

డీఎంహెచ్‌ఓ రామారావు

ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సోమవారం జరగనుండగా అర్హులైన ప్రతీ విద్యార్థి ఆల్బెండజోల్‌ మాత్ర తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రామారావు సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జనాభా నియంత్రణ, తల్లీశిశు ఆరోగ్యం, సమతుల్య కుటుంబ వ్యవస్థ, బాలికల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆల్బెండజోల్‌ మాత్రల తో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదలలో సమస్యలు రావని చెప్పారు. కాగా, వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కట్టడికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, జ్వరం వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నుంచి రక్షణ హెచ్‌పీవీ టీకా బాలికలకు తల్లిదండ్రులు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.వీ.పాలెం పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌ రెడ్డి, హెచ్‌ఈఓ భద్రు, ఆశా కార్యర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డాక్టర్‌ సుబ్బారావుకు

గోల్డ్‌ మెడల్‌

ఖమ్మం వైద్యవిభాగం: ప్రముఖ పల్మనాలజిస్ట్‌, క్షయ నివారణ జిల్లా మాజీ అధికారి వరికూటి సుబ్బారావును గోల్డ్‌ మెడల్‌ వరించింది. హైదరాబాద్‌లోని డెక్కన్‌ మెడికల్‌ కాలేజీలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పల్మనాలజీ కాన్ఫరెన్స్‌లో ఆయన టీబీ కేర్‌పై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందుకు గాను డాక్టర్‌ కన్వర్‌లాల్‌ ఓరియేషన్‌ గోల్డ్‌ మెడల్‌ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు ఆయనను అభినందించారు. గతంలో సుబ్బారావు జిల్లా క్షయ నివారణ అధికారిగా సుదీర్ఘ కాలం పనిచేయగా, టీబీ నివారణ కోసం విశేష కృషి చేసి రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement