తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

● వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్‌రెడ్డి ఎజెండా ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

● వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్‌రెడ్డి ఎజెండా ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్రంలో తీవ్ర ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయి.. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా ఉత్తర తెలంగాణ రైతులను నిండా ముంచారు. ఈ నీళ్లు వదిలితే భద్రాచలం మునిగిపోతుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గోదావరి నీళ్లు దిగువకు వృథాగా పోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తి పోసుకుంటున్నరు. పట్టిసీమ కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి, తన బాస్‌ చంద్రబాబు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆరాట పడుతున్నారు’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలపై కనీస చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వెంటనే ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతుల ఆకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ తెగితే భద్రాచలం ముంపునకు గురవుతుందని సీఎం అంటున్నారని, కానీ గతంలో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాచలం తట్టుకుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి అసలైన ముంపు ముప్పు ఉంటుందనే అంశంపై రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

ఆరు కళ్లు ఉండి ఏం చేశారు?

సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడకు వెళ్లినా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులపై బాడీ షేమింగ్‌ చేయడం పరిపాటిగా మారిందని పువ్వాడ పేర్కొన్నారు. ఒక కన్నుతోనే తాను మంత్రిగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేశానని తెలిపారు. ఇప్పుడు ముగ్గురు మంత్రులకు ఆరు కళ్లు ఉండీ అందులో పదో వంతైనా చేయకపోవడానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. గత 32 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నా తాను ఇప్పటికీ ఆ బాధ అనుభవిస్తూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి ఇకనైనా చిల్లర మాటలు, వ్యక్తిగత దూషణలు మానుకొని కరువు పరిస్థితులు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కాగా, సీతారామ ప్రాజెక్టు మూడు పంపు హౌస్‌ల నిర్మాణం, ప్రధాన కాల్వ తవ్వకం బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగిందని, తమ ప్రభుత్వం రూ.9వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు చిన్న కాలువ తీసి ఈ ప్రాజెక్టు అంతా తామే నిర్మించినట్లు జిల్లాకు చెందిన ఒక మంత్రి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్‌ నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మక్బూల్‌, బచ్చు విజయ్‌కుమార్‌, బత్తుల మురళి, షేక్‌ షకీనా, ఆరెంపుల వీరభద్రం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement