రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
129మందికి రూ.35లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మంమయూరిసెంటర్: ఆపదలో ఉన్న ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ, పేదల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మందికి మంజూరైన రూ.35,91,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య ఖర్చులు భారం కావొద్దని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేగంగా చెక్కులు జారీ చేస్తున్నామని తెలిపారు. అంతేకాక నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులై న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ప్రాధాన్యతగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడులో రూ. 2.24 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి శంకుస్థాపన చేశాక ఆరేకోడు తండా గ్రామంలో పీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఇదే వేదికపై గ్రామానికి చెందిన 20 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే, తిరుమలాయపాలెం మండలం రమణతండా నుంచి ములకలపల్లి – తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు రూ.1.94 కోట్లతో నిర్మించే లింక్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 77 మందికి రూ. 24.67 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆతర్వాత కొక్కిరేణిలో రూ.20 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కల నెరవేరేలా దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. కాగా, ఎర్రగడ్డలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు బెల్లం చలపతిరావు కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి, అనారోగ్యం నుంచి కోలుకున్న ఏదులాపురం కౌన్సిలర్ తమ్మినేని మంగతాయిని పరామర్శించారు. ఈకార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పి.అనిత, కౌన్సిలర్లు మహేష్, నవీన్, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బండి జగదీష్, సర్పంచ్‌లో మాలోతు భద్రునాయక్, సుజాత, కర్నాటి రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


