రైతు చేయి దాటాక పత్తికి ధర | - | Sakshi
Sakshi News home page

రైతు చేయి దాటాక పత్తికి ధర

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

● క్వింటా ధర రూ.9 వేలుగా నమోదు ● సీడ్‌ ధర, స్పిన్నింగ్‌ మిల్లుల్లో డిమాండ్‌ ఫలితం

● క్వింటా ధర రూ.9 వేలుగా నమోదు ● సీడ్‌ ధర, స్పిన్నింగ్‌ మిల్లుల్లో డిమాండ్‌ ఫలితం

ఖమ్మంవ్యవసాయం: రైతులు పంట మొత్తం విక్రయించాక పత్తి ధర పెరుగుతోంది. పంట సీజన్‌లో తేమ, నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలికింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పత్తి కనీస మద్దతు ధర (8 శాతం తేమ కలిగిన) రూ.8,110గా నిర్ణయించింది. కానీ, ప్రైవేట్‌ మార్కెట్‌లో ఈ ధర లేకపోవడంతో సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. అక్టోబర్‌లో పత్తి సీజన్‌ ప్రారంభం కాగా ఫిబ్రవరి, మార్చి నాటికి రైతులు పంట మొత్తం అమ్మేశారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి పత్తి ధర మద్దతు ధరకి మించి నమోదవుతూ రూ.8,300గా పలికింది. ఈ నెల మొదటి వరకు రూ.8,550 వరకు పలకగా.. ఖమ్మం మార్కెట్‌లో 10వ తేదీన ఒకేసారి రూ.450 పెరిగి రూ.9 వేలకు చేరింది. ప్రస్తుతం ఇళ్లలో నిల్వ చేసిన రైతులు పంట పెట్టుబడి కోసం ఖమ్మం మార్కెట్‌కు నిత్యం 100 నుంచి 200 బస్తాల వరకు తీసుకొస్తున్నారు.

నిల్వలు అంతంతే..

గత సీజన్‌లో పత్తి అత్యధికంగా సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారుల వద్ద, మిల్లుల్లో నిల్వలు తక్కువగానే ఉన్నాయి. ఫలితంగా స్పిన్నింగ్‌ మిల్లులు, టెక్స్‌టైల్స్‌ అవసరాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమాన పత్తి ధర పెరుగుతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా నూనెల ధరలు పెరగడం, ఇందులో పత్తి నూనె కూడా ఉండడంతో సీడ్‌ ధర పెరిగింది. క్వింటా రూ.4,100గా ఉన్న సీడ్‌ ధర ఆయిల్‌ డిమాండ్‌తో రూ.4,600కు చేరింది. ఇది కూడా పత్తి ధర పెరగడానికి దోహదపడుతోందని చెబుతున్నారు. ఈ ఏడాది కేంద్రం పత్తి క్వింటాకు మద్దతు ధర రూ.8,667గా నిర్ణయించగా.. ప్రస్తుతం ప్రైవేట్‌ మార్కెట్‌లో అంతకు మించి పలుకుతున్నా సీజన్‌ వచ్చేసరికి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement