సత్తుపల్లి: సింగరేణి కార్మికుల పక్షాన ప్రశ్నించేందుకు వస్తున్న తమను అడ్డుకోవడం సరికాదని, సింగరేణితో పెట్టుకున్నోళ్లు బాగుపడిన చరిత్ర లేదని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సందర్శనకు హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తదితరులతో కలిసి వచ్చారు. అయితే, అనుమతి లేదని పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ గేట్లు వేయడంతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగి తాళం పగలగొట్టారు. ఈక్రమాన ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కవిత మాట్లాడుతూ కార్మికులను కలవకుండా గుర్తింపు సంఘం, సింగరేణి అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. ఏఐటీయూసీ యూనియన్ యాజమాన్యానికి అండగా నిలవడం మానేసి కార్మికుల హక్కులను కాపాడాలని సూచించారు. సింగరేణి ఆస్పత్రిని కేవలం రెండు పడకలతో నడుపుతుండగా, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇల్లెందు, మణుగూరు పరిస్థితి సత్తుపల్లికి తలెత్తకుండా కొత్త గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాగా, కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఈ నెల 20న నిరాహారదీక్ష చేస్తామని కవిత ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన ఆమె టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సారన్న, నాయకులు గుట్టు కరుణ, వనం నాగేందర్, కిషన్‌నాయక్, వన్నెంరెడ్డి సాగర్, ఆంజనేయులు, ఆజ్గర్‌ఖాన్, వరికూటి శ్రీనివాస్, సందీప్, రెడ్డమ్మ, మహేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత


