ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి మహా కుంభాభిషేకం స్వర్ణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల శాంతి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి – కోటేశ్వరరావు దంపతులు కల్యాణం నిర్వహించగా, శివపార్వతుల స్వరూపాలుగా భావిస్తూ లోక కల్యాణార్ధమై గోమాత – వృషభ కల్యాణాన్ని సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు – స్వప్న దంపతుల చేతుల మీదుగా పూర్తిచేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


