ఎయిర్‌పోర్టు ఆశలకు మళ్లీ రెక్కలు | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు ఆశలకు మళ్లీ రెక్కలు

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

సర్వే వివరాలు విమానయానశాఖ

మంత్రికి చేరవేత

కేంద్ర మంత్రికి మరోసారి లేఖ రాసిన మంత్రి తుమ్మల

667 ఎకరాల్లో..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫీజుబులిటీ నివేదిక రూపొందించింది. ఆ వివరాలను పరిశీలించాలంటూ కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ రాశారు.

చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆది నుంచి చొరవ చూపిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయగా.. ఫీజుబులిటీ రిపోర్టును పది రోజుల్లో తయారు చేయాలని ఆయన గత నెల 23న ఆదేశించారు. కేంద్రం నుంచి చర్యలు మొదలుకాక ముందే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. గతంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం పరి శీలించిన స్థలాలు ఒకసారి ఎకనామికల్‌గా, మరో సారి టెక్నికల్‌గా అనువుగా లేవని తేలాయి. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజ్‌ టెక్నాలజీస్‌ అనే థర్డ్‌ పార్టీ సంస్థ చేత ఫీజుబులిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించింది.

ఆరు స్థలాల పరిశీలన

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్థలాలను ఎంపిక చేసింది. అవి వరుసగా దుమ్ముగూడెం, పాల్వంచ, చాపరాలపల్లి (ములకపల్లి మండలం), పెనగడప (చుంచుపల్లి మండలం), సుజాతనగర్‌ మండలంలో సీతంపేట, సుజాతనగర్‌ గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్టు స్థలాలు, కొండలు గుట్టలు, వాగులు వంకలు తదితర వివరాలను పేర్కొంటూ ఫీజుబులిటీ సర్వే రూపొందిచారు. ఆ నివేదిక ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతాలుగా సీతంపేట, సుజాతనగర్‌లు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి.

త్వరలో రంగంలోకి కేంద్రం

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం రాజ్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూపొందించిన ఫీజుబులిటీ రిపోర్టును జత చేస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం మరో సారి లేఖ రాశారు. థర్డ్‌పార్టీ రూపొందించిన నివేదికను ఫీజుబులిటీ రిపోర్టుగా భావించి, తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తీసుకునే చర్యలకు రారష్ట్‌ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఎయిర్‌పోర్టుకు సంబంధించి కేంద్ర తరఫున అధికారిక చర్యలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్రం ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటే తదుపరి చర్యగా టెక్నికల్‌ కమిటీని ఇక్కడకు పంపించే అవకాశం ఉంది. లేకపోతే ఏవియేషన్‌ శాఖ ద్వారా తానే ఫీజుబిలిటీ రిపోర్టు తెప్పించుకునే అవకాశం ఉంది.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌

(ఏఐ చిత్రం)

ఫీజుబులిటీ సర్వే నిర్వహించిన

రాష్ట్ర ప్రభుత్వం

సీతంపేట, సుజాతనగర్‌ల దగ్గర సుమారు 667 ఎకరాల స్థలం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనువుగా ఉన్నట్టు ప్రాథమిక సర్వేలో తేలింది. 80 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్‌–72–600 తరహా విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ఇక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తేలింది. స్థల లభ్యత, భూతల స్వరూపం, రన్‌వే దిశ, ఎత్తు పరిమితి ఉపరితలాలు (అబ్‌స్టకల్‌ లిమిటేషన్‌ సర్ఫేసెస్‌), పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలు వంటి అంశాల్లో సీతంపేట, సుజాతనగర్‌లు ముందు వరుసలో నిలిచాయి. ఈ స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటే తదుపరి దశలో ఏవియేషన్‌ శాఖ నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావనే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement