ఈనెల 18న ప్రత్యేక లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

ఈనెల 18న ప్రత్యేక లోక్‌అదాలత్‌

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు

ఖమ్మంలీగల్‌: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్‌ ఎం.నాగరాజు తెలిపారు. ఈమేరకు శనివారం బ్యాంకర్లు, చిట్‌ఫండ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న చెక్‌ బౌన్స్‌ కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు పరిష్కరించుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.శివరంజని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.రమేష్‌, న్యాయవాది ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు నేలకొండపల్లి మండలం బోదులబండలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు కల్లూరు మండలం చిన్న కోరుకొండిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక, కల్లూరు మున్సిపాలిటీ పరిధి పుల్లయ్య బంజరలో లోకవరం–పెనుబల్లి మార్గంలో హైలెవల్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఆతర్వాత కల్లూరు అంబేద్కర్‌ సెంటర్‌లో డ్రెయిన్లు, ఖమ్మం–అశ్వారావుపేట హైవేపై కల్లూరు జంక్షన్‌ అభివృద్ధి పనులు, సాయంత్రం 3గంటలకు సత్తుపల్లిలోని జేవీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో రన్నింగ్‌ ట్రాక్‌, టెన్నిస్‌ కోర్ట్‌, వాలీబాల్‌ కోర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద బుగ్గపాడు–యాతాలకుంట ఆర్‌అండ్‌బీ రోడుడపై హై లెవల్‌ బ్రిడ్జిని మంత్రి ప్రారంభిస్తారు.

ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లా విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి ఒక ప్రకటనలో సూచించారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ అయ్యేలా అకౌంట్‌ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. అంతేకాక ప్రతీ విద్యార్థి అకౌంట్‌కు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయించుకోవాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు.

కొనసాగుతున్న

‘రైతు భరోసా’ జమ

ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రైతుభరోసా ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు శనివారం ఆరు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,25,505 మంది రైతుల ఖాతాల్లో రూ.333.46 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 85,803 మంది రైతులకు రూ.86.36 కోట్లు జమ అయ్యాయి. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో 81,485 మందికి రూ.81.92కోట్లు, పాలేరులో 76,628 మందికి రూ.74.02 కోట్లు, వైరాలో 62,657 మందికి రూ.71.06 కోట్లు, ఖమ్మం నియోజకవర్గంలో 17,729 మందికి రూ.19.06 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలో 1,203 మంది రైతులకు రూ.1.04 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.

కేయూ దూరవిద్యలో

ప్రవేశానికి దరఖాస్తులు

ఖమ్మంసహకారనగర్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌(గతంలో ఎస్‌డీఎల్‌సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.గోపి తెలిపారు. బీఏ, బీకాం జనరల్‌, కంప్యూటర్స్‌, బీబీఏ, బీఎస్సీ మ్యాథ్స్‌, బీఎల్‌ఐసీతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు. వివరాలకు 80088 11998 నంబర్‌లో లేదా కేయూ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement