‘సర్’ సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు
● ప్రజారోగ్యం, వరదలపై అప్రమత్తంగా ఉండాలి ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
ఖమ్మం సహకారనగర్: పంట మార్పిడి చేయడమే కాక ఆయిల్ పామ్ సాగుకు ముందుకొచ్చేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వానాకాలం పరిస్థితులు, తాగునీటి సరఫరా, ఎరువులు–విత్తనాల లభ్యత, ప్రజారోగ్యం, వరదల సన్నద్ధత, విద్యాశాఖపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించినందున జిల్లాల వారీగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మున్నేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే, విత్తనాలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల కట్టడి, వరదల సన్నద్ధత, విద్యాశాఖలో అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
పనులు త్వరగా పూర్తి చేయండి
జిల్లాలో రహదారులు, వంతెనలు, ఇతర నిర్మాణాలు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన ఆర్‌అండ్‌బీ పరిధిలో పనులపై అధికారులతో సమీక్షించారు. పనులకు ఆటంకాలు రాకుండా పర్యవేక్షించాలని, సీఆర్‌ఎఫ్ నిధులతో చేపట్టే రహదారి నిర్మాణాల సందర్భంగా ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలని తెలిపారు. ఖమ్మం కేబుల్ బ్రిడ్జి వద్ద రహదారి, ముదిగొండ–వల్లభి నాలుగు లేన్ల రహదారి, బోనకల్ – ఆళ్లపాడు రహదారి పనులపై సూచనలు చేశారు. ఇక ఈనెలలో సీఎం జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యుగంధర్, ఈఈ బషీర్, సీతారామయ్య, డీఈ భగవాన్ పాల్గొన్నారు.
మాజీ సీఎం రోశయ్యకు నివాళి
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దివాకర పూలమాల వేసి నివాళులర్పించాక మాట్లాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా బడ్జెట్ రూపకల్పనలో రోశయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీని వాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా, చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని జాబితా నుండి తొలగిస్తూ అవసరమైన సవరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 1,460 మంది బూత్ లెవల్ అధికారులను నియమించగా, ఇప్పటివరకు 12,29,139 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీతో 98.82 శాతం పూర్తయిందని తెలిపారు. అంతేకాక ఓటర్ల నుంచి అందిన వాటిలో 1,47,344 ఫారాల (11.85 శాతం) డిజిటలైజేషన్ చేశామని పేర్కొన్నారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి మునిసిపల్, మండల కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.


