● లైసెన్సు కోసం ప్రభుత్వం కసరత్తు ● ఉద్యోగుల బదలాయింపుపై చర్చ ● జిల్లా నుంచి 80 మంది ఉద్యోగుల దరఖాస్తు
ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం రూపు దాల్చుకుంటోంది. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, ఇతర ప్రభుత్వ, మున్సిపల్ నీటి సరఫరా పథకాలతో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ కోసం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఆర్పీడీసీఎల్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2 వేల మంది ఉద్యోగులు అవసరమని గుర్తించగా, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు 3 వేల మంది పలు కేటగిరీల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 712 మంది, జెన్‌కో నుంచి 446, ట్రాన్స్‌కో నుంచి 166 మందితో ఇంకొన్ని విభాగాల వారు ఉన్నారు. ఇదే సమయాన విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మాత్రం సరైన విధివిధానాలు ప్రకటించకుండా నూతన డిస్కం ఏర్పాటు సరికాదని ఆందోళన చేయడంతో ప్రక్రియకు బ్రేక్‌లు పడ్డాయి. కానీ ప్రభుత్వం మాత్రం డిస్కం ఏర్పాటుపై నిపుణులతో చర్చించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) లైసెన్సు జారీకి కసరత్తు చేస్తుండడంతో త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలిసింది.
ఈ సీజన్‌లో సరికాదు..
ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ రైతు డిస్కంను ఎలా అమల్లోకి తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బోరు బావులు, ఎత్తిపోతల పథకాలు, బావుల కింద పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న సంస్థ నుంచి వ్యవసాయ కనెక్షన్లను రైతు డిస్కంకు మార్చడం ఇబ్బందిగా ఉంటుంది. అసలే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండవని చెబుతున్నారు. దీంతో బావులు, ఇతర వనరుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా సాగు అవసరాలకు ఉపయోగించుకోవాలని రైతులు భావిస్తుండగా, నూతన డిస్కం ఏర్పాటు పనులు మొదలుపెడితే తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ మేరకు వానాకాలం, యాసంగి సీజన్లలో డిస్కం ప్రణాళికలు సిద్ధం చేసి.. వచ్చే వేసవి ఏప్రిల్ నుంచి కనెక్షన్ల మార్పు, ఇతర పనులు చేపడితే మంచిదనే సూచనలు వస్తున్నాయి. ఇక ప్రత్యేక డిస్కం ఏర్పాటుతో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తుండగా, ఎంత మేర ప్రభావం ఉంటుందని రైతుల్లో చర్చ జరుగుతోంది.
ఉద్యోగుల బదలాయింపుపై చర్చ
ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విద్యుత్ సంస్థల నుంచి పలు నిష్పత్తుల్లో ఉద్యోగుల బదలాయింపునకు నూతన సంస్థ రైతు డిస్కం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుంచి 40 శాతం చొప్పున, జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి 10 శాతం చొప్పున ఉద్యోగులను బదలాయించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించాక ప్రస్తుత సంస్థల నుంచి రైతు డిస్కంలోకి బదలాయించే అవకాశముంది. ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది రైతు డిస్కంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఖమ్మం సర్కిల్ నుంచి పలు కేటగీరీల్లో 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల బదలాయింపు అంశంపై విద్యుత్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, బదలాయింపు పూర్తయ్యాక విద్యుత్ సంస్థల్లో బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశముందని చెబుతున్నారు.


