● ప్రశ్నించే గొంతుకలు వెళ్లిపోతుంటే బాధేస్తోంది ● అరుణోదయ నాగన్న సంతాప సభలో కళాకారులు, నాయకులు ● ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
ఖమ్మంమయూరిసెంటర్: కంచుకంఠంతో పీడిత జనం గుండెల్లో విప్లవ రాగాల గోదారి పారించిన ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అగ్రనేత నాగన్నకు పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ఖమ్మంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయం వద్ద నిర్వహించిన నాగన్న సంతాప సభలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొని నివాళులర్పించారు.
నాగన్న గళం.. ప్రజా పోరాటాలకు ఊపిరి
ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, అరుణోదయ విమలక్క, కవి జయరాజు, ఏపూరి సోమన్న, పీవీ శ్రీనివాసరావు, సృజన తదితరులు మాట్లాడారు. ప్రస్తుత ప్రజా కార్యక్రమాలు, విప్లవ ఉద్యమాలకు ఊపిరి పోసిన కంచుగళం నాగన్నదని తెలిపారు. ఎన్నో సభల్లో ఆయన పాడిన రామనరసయ్య పాటలు, బురక్రథలు వింటూ ఉత్తేజం పొందామని చెప్పారు. నాగన్న కేవలం కళాకారుడే కాదని, విప్లవోద్యమ సాంస్కృతిక రంగాన్ని నమ్ముకుని జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని కొనియాడారు. పెద్ద చదువులు లేకున్నా భార్య లక్ష్మక్క తోడుతో అరుణోదయంలో ఆయన పోషించిన పాత్రను ఎవరూ మరవలేరని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా తన కుమారుడి పేరు రాయడానికి ఒప్పుకోని నిస్వార్థపరుడు నాగన్న అని తెలిపారు. అయితే, సమాజం కోసం పుట్టి, విప్లవోద్యమంలోనే ఒరిగిపోయిన ఆయనతో పాటు ప్రశ్నించే గొంతులన్నీ మూగబోతుంటే బాధ కలుగుతోందని పేర్కొన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు..
నాగన్న మరణ వార్త తెలుసుకుని తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల కవులు, కళాకారులు, వామపక్ష పార్టీల నాయకులు ఖమ్మం తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగన్న మృతదేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి జయరాజుతో పాటు పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఆవునూరి మధు, ఏపూరి సోమన్న పీపీ ప్రసాద్, చెరుకు సుధాకర్, సంధ్యక్క, ఝాన్సీ, యశ్‌పాల్, గోవర్దన్, స్పర్శ భాస్కర్, పుష్ప, జ్వాల వెంకటేశ్వర్లు, గాదె రామనర్సయ్య, బండారు ఐలయ్య, కోల లక్ష్మీనారాయణ తదితరులు నాగన్న భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కాగా, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అంతేకాక దొడ్డి కొమరయ్య సినిమా బృందం సేనాపతి, షేక్ అబ్దుల్ రహిమాన్, కాయితోజు వెంకటేశ్వర్లుతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేవీ కృష్ణారావు తదితరులు కూడా నివాళులర్పించారు. ఆ తర్వాత ఖమ్మంలో భారీ ఊరేగింపుగా వెళ్లి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చేరుకుని నాగన్న భౌతికకాయాన్ని అప్పగించారు. ఈ క్రమాన కళాకారులు గోదారి నదిలా గెంతులేసే పాట.. నాగన్న పాట విప్లవాల పాట.., ఏ దారి లేనోళ్లనొకటి చేసే పాట.. పేదోళ్ల పాట నాగన్న నోట.. అంటూ పాటలు పాడడమే కాక కళారూపాలు ప్రదర్శించారు.


