● నేడు అభయాంజనేయ స్వామి,
ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన
తల్లాడ: మండలంలోని గొల్లగూడెంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఆదివారం జరగనుంది. గ్రామంలో ఇప్పటికే ఉన్న రామాలయానికి సమీపాన గ్రామస్తులు, దాతల చేయూతతో రూ.కోటి నిధులు వెచ్చించి అభయాంజనేయ స్వామి ఆలయాన్నినిర్మించారు. ఈ మేరకు ఆదివారం ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, నాగేంద్రుడు, లక్ష్మీదేవి విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. అర్చకులు కంచెల సతీశ్‌శర్మ ఆధ్వర్యాన ఈ పూజలు జరగనుండగా, గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రతిష్ఠాపనకు సైతం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు వీక్షించేందుకు గ్రామంలోని అందరి ఇళ్లకు బంధువులు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
● ఇద్దరు జీపీఓలపై ఆర్‌డీఓ విచారణ
వైరారూరల్: రెవెన్యూశాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలకమైన గ్రామపాలన అధికారులు (జీపీఓ) విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఖమ్మం ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాసరావు హెచ్చరించారు. మండలంలోని గొల్లపూడి, సోమవరం జీపీఓలపై ఫిర్యాదులు అందడంతో ఆయన వైరా తహసీల్‌లో విచారణ చేపట్టారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో జారీ చేయడం లేదనే తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆర్‌డీఓ విచారించారు. అనంతరం మండలంలోని జీపీఓలందరితో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. పనితీరు మార్చుకుని విధుల్లో అలసత్వాన్ని వీడాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరా తహసీల్దార్ సీహెచ్ సురేశ్‌బాబు పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ సైన్స్‌పై
న్యాయవాదులకు సెమినార్
ఖమ్మంలీగల్: సివిల్, క్రిమినల్ న్యాయ వ్యవహారాల్లో కీలకమైన వేలిముద్రల సేకరణ, పోస్టుమార్టం వివరాల పరిశీలనలో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్‌పై న్యాయవాదులకు అవగాహన కల్పించేందుకు శనివారం సెమినార్ నిర్వహించారు. బార్ అసోసియేయేషన్ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని ‘ప్రోబ్’ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్న నేపథ్యాన సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ‘ప్రోబ్’ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ఎర్రగొల్ల మురళి పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్లపల్లి రమేశ్, కొప్పుల రవికుమార్‌తో పాటు న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఏడీగా డీఈఓ కార్యాలయ ఉద్యోగికి పదోన్నతి
ఖమ్మంసహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పదోన్నతి కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఆయనను నిర్మల్ డీఈఓ కార్యాలయం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సోదరి, కోడలిపై దాడి.. హత్యాయత్నం
● సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
ఖమ్మంఅర్బన్: అప్పుగా తీసుకున్న రూ.35 లక్ష లు, బంగారు ఆభరణాల వివాదంలో సోదరి, మేనకోడలిపై దాడి చేయడమే కాక సోదరికి బలవంతంగా పురుగులమందు తాగించిన ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ఖమ్మం అర్బన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఖమ్మంలో నివాసముండే కేలోతు రమేశ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సోదరి పద్మ, ఆమె కుమార్తె గుగులోత్ వాణి వద్ద సుమారు రూ.35లక్షల నగదు, ఆభ రణాలు అప్పు పేరిట తీసుకుని ఇంటి నిర్మాణానికి వినియోగించినట్లు సమాచారం. అయితే, ఈ నగదు, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వారిద్దరు కోరగా జూన్ 28న ఇంటికి పిలిపించి వారి నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులను బలవంతంగా లాక్కొని దాడి చేశాడు. అంతేకాక పద్మకు బలవంతంగా పురుగులమందు తాగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేలోతు రమేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.


