ఖమ్మంవైరారోడ్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ముప్ఫై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9 వేల కోట్లు చెల్లించకపోవడం ప్రభుత్వ తీరును తెలియజేస్తోందని తెలిపారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి కనీస సమీక్షలు కూడా చేయడం లేదన్నారు. 2014లో కేసీఆర్ సీఎం కాగానే ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు సైతం చెల్లించారని తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీకి ఉన్న నిధులు.. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రాకపోవడం గర్హనీయమని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్‌లో అంకెల గారడీ చేస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల భవనాలు నిర్మిస్తుండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ బకాయిలు విడుదల చేయకపోగా, ప్రశ్నించిన కళా శాలల యాజమాన్యాలను విజిలెన్స్ తనిఖీల పేరిట వేధించడం సరికాదని తెలిపారు. అనంతరం పలు పార్టీల నాయకులు గుండాల కృష్ణ, రావి శివరామకృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, ఆవుల అశోక్, బషీర్ మాట్లాడగా, నాయకులు వల్లే శ్రీని వాస్, భూక్యా భద్రు, మేగడ రామారావు, వెంటకటరమణ, రామ్మూర్తి, ఇటికాల రామకృష్ణ, రాకేశ్, వివిధ కళాశాలల యాజమానులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ మధు, మాజీ మంత్రి పువ్వాడ


