● అరుణోదయ నాగన్న కన్నుమూత ● పాటే ఆయుధంగా సాగిన ప్రజాపోరు ప్రస్థానం ● మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చెరగని ముద్ర
ఖమ్మంమయూరిసెంటర్: తెలుగు నేలపై ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల గొంతుకగా నిలిచిన ప్రముఖ విప్లవ ప్రజాగాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పూర్తికాల కార్యకర్త, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు పరకాల నాగన్న (అరుణోదయ నాగన్న) కన్ను మూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ‘కళ.. కళ కోసం కాదు, ప్రజలు, ప్రగతి కోసం’అన్న నానుడికి నిదర్శనంగా నిలిచిన నాగన్న.. ఇంటి పేరునే అరుణోదయగా మార్చుకొని చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచారు. కాగా, నాగన్న కళ్లను నేత్ర నిధికి దానం చేయగా.. ఆయన మృతదేహాన్ని శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులు, నాయకులు నిర్ణయించారు.
ఎమర్జెన్సీకి ముందు నుంచే..
ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం రాజారంలో నిరుపేద కుటుంబానికి చెందిన పరకాల లచ్చుమమ్మ – పాపయ్య దంపతులకు నాగయ్య జన్మించారు. యుక్త వయసులో పశువుల కాపరిగా, కూలి పనులు చేస్తూనే మద్ది వెంకటరెడ్డి (మహేశ్ అన్న) ఇచ్చిన ప్రోత్సాహంతో కళాకారుడిగా జీవనయాత్ర ప్రారంభించారు. స్వగ్రామానికి చెందిన శ్రీపాద శ్రీహరి, పోట్ల రామనర్సయ్య, మంగన్న స్ఫూర్తితో దేశంలో ఎమర్జెన్సీకి ముందే విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత కానూరు వెంకటేశ్వరరావు, సుంకన్న, అరుణోదయ రామారావు బుర్రకథా దళాలతో ప్రేరణ పొంది, అరుణోదయలో పూర్తికాల సభ్యుడిగా చేరారు. విరసం సభ్యుల రచనలు, కాశీపతి ఉపన్యాసాల ప్రభావంతో 1980 నుంచి అరుణోదయ రాష్ట్రస్థాయి కమిటీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.
రామారావు – నాగన్న ద్వయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కానూరి వెంకటేశ్వరరావు దళంలో రామారావు, నాగన్న జోడి విప్లవ సాంస్కృతిక ఉద్యమాల్లో ఉర్రూతలూగించేది. కానూరితో కలిసి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ప్రకాశం, నెల్లూరు, వైజాగ్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం వంటి ప్రాంతాల్లో అరుణోదయ దళాల నిర్మాణానికి నాగన్న కృషి చేశారు. విమలక్క, జయరాజ్, సృజన వెంకట్రాముడు, నాతని హనుమంతరావుతో కలిసి కళారూపాలను ప్రదర్శించారు. 1990 తర్వాత ప్రజా రచయితల సంఘం ఏర్పాటులోనూ నమ్ము జీవన్, అద్దేపల్లి రామ్మోహన్‌రావు, సతీశ్ చందర్ తదితరులతో కలిసి కీలకపాత్ర పోషించారు.
‘ప్రతిఘటన’లో అగ్రభాగాన..
1980 నుంచి 1995 వరకు అరుణోదయ ఇన్‌చార్జ్‌గా ఉన్న పెద్ద చంద్రన్న మార్గదర్శకత్వంలో, ఆ తర్వాత వైఎస్‌ఆర్, వీ.వీ. తదితరుల సహకారంతో సంస్థను నడిపించారు. గుంటూరు మిర్చి యార్డు రైతుల పోరాటం, పత్తి రైతుల ఆత్మహత్యల సందర్భాల్లో నాగన్న ప్రజా చైతన్యాన్ని రగిలించారు. పోరాటాల్లో అమరులైన దొరన్న, విక్రమ్, కట్టా నరసింహారెడ్డి, నీలం రామచంద్రయ్య, పంచాది నిర్మలతో పాటు సిక్కోలు అమరవీరుల త్యాగాలను తన పాటల రూపంలో వినిపించారు.
నిర్బంధాలను ఎదిరించి..
నాగన్న తన మేనత్త కూతురైన లక్ష్మిని వివాహం చేసుకోగా, ఆమె జీవిత భాగస్వామిగానే కాక ఉద్యమ సహచరిగానూ తోడయ్యారు. అరుణోదయ, పీఓడబ్ల్యూ(ప్రగతిశీల మహిళా సంఘం) సంస్థల్లో పనిచేస్తూ పోలీసు నిర్బంధాలు, అరెస్టులు, జైలు జీవితాలను సైతం లెక్కచేయలేదు. వీరికి కుమారుడు అజయ్ ఉండగా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ ప్రజా ఉద్యమాలకే ప్రాధాన్యతనిచ్చారు. ప్రస్తుతం అజయ్ కూడా సాంస్కృతిక రంగంలోనే నడుస్తున్నారు.
సమాజానికి ఆదర్శం
సిద్ధాంతం, ఆచరణ వేర్వేరు కాదంటూ ఖమ్మం మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో చిన్న రేకుల షెడ్డులో బడ్డీకొట్టు నడుపుకుంటూ నాగన్న నిరాండబరంగా జీవించారు. దేశంలో కుల నిర్మూలనే ప్రగతికి మార్గమని, బహుజన రాజ్య స్థాపనను కాంక్షించిన ఆయనకు పలు సత్కారాలు లభించాయి.
మాస్‌లైన్, న్యూడెమోక్రసీ కార్యాలయాల్లో..
నాగన్న మృతదేహాన్ని తొలుత సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యాలయమైన రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ మాస్‌లైన్ రాష్ట్రకార్యదర్శి పోటురంగారావు, గుర్రం అచ్చ య్య, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ తదితరు లు నివాళులర్పించగా.. పోటు రంగారావు మాట్లా డుతూ.. తెలుగునాట విప్లవ గానం, పాట, అరుణో దయకు చిరునామాగా ఐదు దశాబ్దాలపాటు నిలిచిన నాగన్న మృతి విప్లవ కళా సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయానికి నాగన్న మృతదేహాన్ని తరలించగా.. అక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, అవునూరి మధు, బండారి ఐలయ్య తదితరులు నివాళులర్పించి విప్లవ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేకాక సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, బీఆర్‌ఎస్ నాయకులు పగడాల నాగరాజు, సామాజిక కార్యకర్తలు స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజయ్‌తో పాటు రచయితలు తదితరులు నాగన్న మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా, నాగన్న మృతి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపాన్ని ప్రకటించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవులతో కలిసి అనేక ‘ధూమ్ ధామ్’కార్యక్రమాల్లో నాగన్న తన ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన దండోరా సినిమా కోసం కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ.. కొడవండ్లు చేపట్టవే పాట పాడారు. అక్షరదీపంలో బావ నేను బడికిపోతా, సారా వ్యతిరేక ఉద్యమంలో పెద్దత్తో దాన్ని పయనం చెయ్యి వంటి పాటలతో సామాజిక మార్పులోనూ భాగం పంచుకున్నారు. అన్నా అమరుడు రామ నరసయ్య, ఉయ్యాలలూగింది శిశువు, దొరన్న మాటంటే మాటేరో, పొద్దు పొడిచే.. పొద్దు పొడిచే ఇల్లందు మీద ఎల్లన్న పాట, ఎగిసెగిసి పడుతోంది గోదావరి ఎర్రజెండా.. ఎగిసింది గోదావరి వంటి విప్లవ గేయాలతో ప్రజలను చైతన్యపరిచారు. వాగ్గేయకారుడు అరుణోదయ రామారావు మరణాంతరం నాగన్న ఆలపించిన ‘నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయంతా ఊగింది ఉయ్యాల’పాట విప్లవ చరిత్రలో అమరత్వమై నిలిచింది.


