ఖమ్మంక్రైం: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమా రు రూ.15 లక్షల మేర మోసం చేసిన కేసులో నిందితురాలిని ఖమ్మం సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో అరెస్ట్ చేయగా, శుక్రవారం ఖమ్మంలో వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్‌లో పరిచయమైన నిందితురాలు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్, పెట్టుబడిద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలు మార్లు రూ.15లక్షలు జమ చేయించింది. ఇలాగే, పలు రాష్ట్రాల్లో మరికొందరి నుంచి నగదు జమ చేయించగా, రూ.3కోట్ల మేర లావాదేవీలు త్రివేండ్రంకు చెందిన ఆర్యదాస్ శైలజ ఖాతా ద్వారా జరిగాయని గుర్తించారు. ఈ మేరకు త్రివేండ్రంలో ఆమెను అరెస్ట్ చేసిన ఖమ్మం సైబర్‌క్రైం పోలీసులు ఇక్కడకు తీసుకొచ్చి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, సీఐ రవికుమార్, ఎస్‌ఐలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్, సిబ్బందిని సీపీ సునీల్‌దత్ అభినందించారు.


