సర్‌పై అపోహలు వద్దు | - | Sakshi
Sakshi News home page

సర్‌పై అపోహలు వద్దు

Jul 4 2026 12:14 AM | Updated on Jul 4 2026 12:14 AM

ఒకే చోట ఫామ్‌ ఇవ్వాలి..

జిల్లాలో 98శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ

ఈనెల 11లోగా ఓటర్ల నుంచి

తిరిగి సేకరిస్తాం

రెండు చోట్ల ఓటు ఉంటే ఒకేచోట

ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వాలి

అవగాహన కోసం హెల్ప్‌డెస్క్‌లు,

కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై ప్రజలు అపోహలు విడనాడాలి. ఎలాంటి భయం లేకుండా అందరూ భాగస్వామ్యం అవ్వాలి. 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్‌ చేసుకోవాలి. లేకపోతే 11 డాక్యుమెంట్లలో కావాల్సిన పత్రం కోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను ఎన్యుమరేషన్‌ ఫామ్‌కు జత చేసి సమర్పిస్తే సరిపోతుంది’. అని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ, క్షేత్ర స్థాయి పరిస్థితులపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన

ఇంటర్వ్యూలో కలెక్టర్‌ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

వారం రోజుల్లో 98 శాతం

జిల్లాలో 12,43,781 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,21,533 మంది(98.21 శాతం)కి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయింది. గతనెల 25 నుంచి ఈ ప్రక్రియ మొదలుకాగా ఈ వారమంతా ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ పంపిణీపైనే దృష్టి సారించాం. ప్రస్తుతం ఓటర్లు నింపిన ఫామ్స్‌ను బీఎల్‌ఓలు సేకరిస్తుండగా 70,700 ఫామ్స్‌ అందాయి. వీటి డిజిటలైజేషన్‌ కూడా మొదలైంది. జిల్లాలో మ్యాప్‌, అన్‌ మ్యాప్‌, అనామలిస్‌ జాబితా ఉండడం వల్ల పని వేగంగా జరుగుతోంది. రానున్న పది రోజుల్లో ఫామ్స్‌ సేకరణపై ఫోకస్‌ పెడతాం. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, ఇళ్లలో ఉండని వారికి ఫోన్లు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 10, 11 తేదీ వరకు ఫామ్స్‌ సేకరణ పూర్తి చేసి.. ఎవరైనా మిగిలిపోతే మ్యాపింగ్‌ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడంపై దృష్టి సారిస్తాం.

మండలానికి ఒక హెల్ప్‌డెస్క్‌

ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపడంలో నిరక్షరాస్యులు, వృద్ధులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. అవగాహన కల్పించడానికి మండలానికి ఒకటి చొప్పున 21 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశాం. ఈఆర్‌ఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌ ఉంది. 08742–221951కు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసినా అనుమానాలు తీరుస్తారు. ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్‌ఓలు సైతం ఫారాలు ఎలా నింపాలో ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. ఈ విధానంపై వీడియో కూడా రూపొందించాం. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లాలే తప్ప ఒకే దగ్గర కూర్చుని ఫామ్స్‌ పంపిణీ, సేకరణ చేయకూడదు.

మ్యాపింగ్‌ కాకపోతే..

ఓటరు పేరు డేటాబేస్‌తో సరిపోలకపోతే వారికి ఈఆర్‌ఓ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందాక నిబంధనల మేరకు పత్రాలు అందించాలి. 1987 జూలై 1కు ముందు జన్మించిన వారైతే పుట్టిన తేదీ, జన్మస్థలాన్ని ధ్రువీకరిస్తూ 11 డాక్యుమెంట్లలో ఒకటి జత చేయాలి. 1987 నుంచి 2004 డిసెంబర్‌ 2 మధ్య జన్మిస్తే పుట్టినతేదీ, పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్‌తోపాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఒక సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఇక 2004 తర్వాత జన్మించినట్లయితే ఓటరు పుట్టిన తేదీ, జన్మస్థల పత్రాలే కాక తల్లిదండ్రులిద్దరి పుట్టినతేదీ, పుట్టిన స్థలం ధ్రువీకరిస్తూ 11 రకాల డాక్యుమెంట్ల నుంచి చెరొకటి జత చేయాలి.

బీఎల్‌ఏల సాయం పొందొచ్చు..

‘సర్‌’ ప్రక్రియను పర్యవేక్షించడానికి రాజకీయ పార్టీలు బీఎల్‌ఏ(బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు)ను నియమించుకున్నాయి. ఎన్యుమరేషన్‌ ఫారం నింపేందుకు ఓటర్లు వారి సాయం తీసుకోవచ్చు. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా తెలిసిపోతుంది. బీఎల్‌ఏలు కూడా చురుగ్గా పాల్గొంటేనే ఈ ప్రక్రియపై అపోహలు తొలగిపోతాయి. ఒక్కో బీఎల్‌ఏ రోజుకు 50 ఫారాలు నింపి ఇవ్వొచ్చు. ఓటర్లు అర్థం కావడం లేదు, తెలియడం లేదని అని అనుకోకుండా అందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలి.

అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించడమే కాక.. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు నకిలీ ఓట్లను తొలగించడమే ‘సర్‌’ లక్ష్యం. గ్రామంలో ఓ ఓటు, మరో ఓటు నివాసముండే చోట ఉంటే ఒకే ఓటు కొనసాగించాలి. ఓటు కావాల్సిన చోటే ఎన్యుమరేషన్‌ ఫారం నింపి ఇవ్వాలి. అలా కాకుండా రెండుచోట్ల ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ ఇవ్వడం నేరం అవుతుంది. అలాంటి వాళ్లకు శిక్ష ఉంటుంది. చాలామంది ఒకేచోట ఓటు హక్కు ఉంచుకుంటామని డిక్లరేషన్‌ ఇస్తున్నారు.

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement