● అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ
ఏన్కూరు: ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ఏన్కూరు మండలం భగవాన్‌నాయక్ తండాలో ఇంకుడు గుంతల నిర్మాణాల ను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నీరు వృథా కాకుండా భూమిలో ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరిగి ఇక్కట్లు రావని తెలిపారు. ఈమేరకు ఇళ్లలోనే కాక పొలాల్లో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కె.శ్రీరామ్, సర్పంచ్ ధరావత్ మణి, వివిధ శాఖల ఉద్యోగులు కరుణశ్రీ, జీవీఎస్.నారాయణ, నర్సింహారావు, సూరయ్య, మౌనిక పాల్గొన్నారు.
ఐదెకరాల వరకు
పెట్టుబడి సాయం జమ
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం జమ కొనసాగుతోంది. రైతు భరోసా ద్వారా శుక్రవారం ఐదెకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ అయింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా 3,17,212 మంది రైతుల ఖాతాల్లో రూ.306.34 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో 17,272 మంది రైతులకు రూ.17.58 కోట్లు, సత్తుపల్లిలో 79,338 మంది రైతులకు రూ.74.87 కోట్లు, పాలేరులో 74,981 మంది రైతులకు రూ.68.68 కోట్లు, మధిరలో 83,580 మంది రైతులకు రూ.79.09 కోట్లు, వైరా నియోజకవర్గంలో 60,842 మంది రైతులకు రూ.65.10 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గం(కామేపల్లి మండలం)లో 1,199 మంది రైతుల ఖాతాల్లో రూ.1.02 కోట్లు జమ అయ్యాయని వివరించారు.
ఉపాధి పథకాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యాన స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముహమ్మద్ ముజాహిద్ తెలిపారు. అర్హులైన క్రిస్టియన్ మైనార్టీలు కుట్టు మిషన్, చిరువ్యాపారం, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్ బైక్ కోసం ఈనెల 18లోగా tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల వారైతే వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాల ని తెలిపారు. కుట్టు మిషన్, చిరువ్యాపారాలకు 21 – 55 ఏళ్లు, ఇతర పథకాలకు 21 – 50 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించారు.
జిల్లా మలేరియా అధికారిగా వెంకటేశ్వర్లు
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా మలేరియా అధికారిగా కె.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన హనుమకొండ జిల్లాలో జపనీస్ మెదడు వాపు, వాహక వ్యాధుల నియంత్రణ విభాగంలో సీనియర్ ఎంటమాలజిస్ట్‌గా, జీహెచ్‌ఎంసీలో జీవశాస్త్ర నిపుణుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణ మలేరియా పథకంలో సీనియర్ ఎంటమాలిజిస్ట్‌గా పనిచేస్తూ జిల్లా మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను డీఎంహెచ్‌ఓ అభినందించగా, మలేరియా, డెంగీ నివారణ, నియంత్రణ చర్యలపై సూచనలు చేశారు.
ప్రభుత్వ వైద్యసేవల్లో నాణ్యతపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా అన్ని ఆస్పత్రుల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీఎంహెచ్‌ఓ డి.రామారావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని వేగ హోమియోకేర్ క్లినిక్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రిలో క్షయ వ్యాధి నివారణ కేంద్రం, పోలియేటివ్ కేర్ సెంటర్, డయాబెటిక్ సెంటర్, రేడియాలజీ విభాగాలను పరిశీలించిన డీఎంహెచ్‌ఓ.. వైద్యసేవలు, మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఆరా తీశారు. రోగులు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.


