● కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే రాగమయి ● సత్తుపల్లిలో భారీ ర్యాలీ, వనమహోత్సవం
సత్తుపల్లిటౌన్: భావితరాల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని.. తద్వారా వాతావరణ మార్పులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన వనమహోత్సవం నిర్వహించగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం అంటే మొక్కలు నాటడమే కాదని, సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం వనమహోత్సవం ద్వారా ఏటా కోట్లాది మొక్కలు నాటుతుండగా, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. ప్రజలు కూడా ఇళ్లలోనే కాక రహదారుల వెంట మొక్కలు నాటే బాధ్యత స్వీకరించాలని చెప్పారు. అనంరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ వనమహోత్సవం ప్రభుత్వ కార్యక్రమమే కాదని, భావితరాలకు మంచి భవిష్యత్‌ను ఇచ్చే సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. తొలుత నాయకులు, విద్యార్థులతో కలిసి జేవీఆర్ కళాశాల నుంచి పాతసెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగరేణి సహకారంతో ఏర్పాటుచేసిన 12 కంప్యూటర్ల ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండి రెహానాబేగం, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, నీరజాదేవి, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు గాదె చెన్నారావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, బొంతు సుమలత, ఎం.డీ.కమల్‌పాషా, నాయుడు వెంకటేశ్వరరావు, సందీప్ గౌడ్ పాల్గొన్నారు.


