ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి మహా కుంభాభిషేకం స్వర్ణోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి పాల్గొని శ్రీవారు, అమ్మవార్లకు పూజలు చేశారు. అలాగే, స్వామి వారు, ఆలయ విమాన గోపురానికి మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆతర్వాత భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కాగా, ఉత్సవాలకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, సర్పంచ్ తుళ్లూరు నిర్మలకుమారి, ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వకుళామాత స్టేడియం దాత తుళ్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎర్రుపాలెంలోని శ్రీబాలాత్రిపుర సమేత శ్రీచంద్రమౌళేశ్వరస్వామి వారి ఆలయాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి సందర్శించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించాక భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయ చైర్మన్ మగినం విజయ–వీరభద్రం, అర్చకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామి


