సుదర్శన చక్రం గిరగిరా! | - | Sakshi
Sakshi News home page

సుదర్శన చక్రం గిరగిరా!

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

సుందరంగా వ్యూ పాయింట్‌

నేరుగా రహదారి

నిత్యకల్యాణ వేదిక

మిథిలా స్టేడియంలోకి మార్పు

రామాలయం వ్యూ పాయింట్‌, రంగనాయకుల గుట్టపైకి రోడ్డు కూడా

మార్చి నాటికి పనులు ముగించేలా కార్యాచరణ

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరి తీరాన సుదర్శన చక్రం ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని తొలగించినా.. మళ్లీ తెరపైకి తీసుకొచ్చేలా అధికారులు సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మొదటి దశలో గోదావరి ఘాట్ల వద్ద పలు అభివృద్ధి పనులను చేపట్టేలా మాస్టర్‌ప్లాన్‌ ప్రకటించింది. ఇందులో రూ.9 కోట్లతో సుదర్శన చక్ర స్నాన తీర్థంగా ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. అయితే, టెండర్ల సమయాన ఆలయ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకే రూ.200 కోట్లకు టెండర్లను ఖరారు చేశారు. అంతే కాక సుదర్శన చక్ర ప్రాజెక్టుగా నామకరణం చేసిన గోదావరి ఘాట్ల వద్ద పనులను రూ.75 కోట్ల నుంచి రూ.46 కోట్లకు కుదించారు. ఈ మేరకు సుదర్శన చక్ర నిర్మాణాన్ని ప్లాన్‌ నుంచి తొలగించారు. కానీ, భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు గోదావరి ఒడ్డున ఎలాంటి కట్టడాలు లేకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ పెంచేలా అనుమతి తీసుకున్నాక ఇరిగేషన్‌ శాఖ మరోమారు టెండర్లు పిలిచి ఖరారు చేయాల్సి ఉంది. భక్తులు మాత్రం ప్రభుత్వం సుదర్శన చక్రం ప్రాజెక్టును ఆమోదించాలని కోరుతున్నారు.

స్టేడియంలో నిత్యకల్యాణం

ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఈ క్రమాన భక్తులకు ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా బేడా మండపంలో జరుగుతున్న నిత్యకల్యాణం కోసం తొలుత దక్షిణ భాగం వైపు నిర్మించాలని భావించారు. కానీ, మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో వచ్చిన సూచనల మేరకు మిథిలా స్టేడియంలోనే తాత్కాలిక కల్యాణ వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. తాత్కాలిక వేదికకు రూ.50 లక్షలను కేటాయించగా పనులు మొదలుకానున్నాయి. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది మార్చిలోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే పనులను పూర్తి చేయాలని సూచించారు.

ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో వ్యూ పాయింట్‌ కీలకంగా ఉంటుంది. భద్రాచలం క్షేత్రంలో ఇలాంటివేవీ లేవు. ఈ నేపథ్యాన అభివృద్ధి పనుల్లో అధికారులు ఈ కొరతను తీర్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కుసుమ హరినాథబాబా ఆలయం కింద మట్టి తొలగించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయం ఎత్తుగా ఉండడంతో అక్కడ నుంచి రామాలయం, గోదావరి ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యాన హరిబాబా ఆలయాన్ని కిందకు మార్చి అక్కడ పార్క్‌, వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి నిర్మాణ సంస్థ బాధ్యులు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాక పురాతన కుసుమహరినాథ ఆలయం ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆకర్షణీయంగా కొత్త ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. కొత్త ఆలయం నిర్మించేవరకు శివాలయం ప్రాంగణంలో బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా అమలైతే భద్రాచలంలో భక్తులు, పర్యాటకులకు అందమైన వ్యూ పాయింట్‌ అందుబాటులోకి వస్తుంది.

ప్రస్తుతం రంగనాయకుల గుట్టపై కాటేజీలు, ఉపాలయాలు, భక్త రామదాసు ధ్యాన మందిరానికి చేరాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, రామాలయం నుంచి రంగనాయకుల గుట్టపైకి నేరుగా రహదారి నిర్మిస్తే దూరం తగ్గుతుంది. ఈ విషయమై ‘సాక్షి’లోనూ కథనాలు రావడం, శివాలయం నుంచి రోడ్డును ఏర్పాటు చేస్తే రంగనాయకుల గుట్ట మరో దర్శనీయ స్థలంగా మారే అవకాశం ఉంది. దీంతో గుట్టపై కాటేజీ నిర్మిస్తున్న నాగార్జున సిమెంట్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బాధ్యులను సంప్రదించగా వారు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం.

భద్రగిరి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులో తిరిగి స్థానం?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement