ఖమ్మంలీగల్: ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.నాగరాజును పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ గురువారం కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
6లోగా సొసైటీల
పత్రాలు అందజేయాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఎన్నికల దృష్ట్యా రిజిస్టర్ అయిన సంఘాల బాధ్యులు ఈ నెల 6వ తేదీలోగా పత్రాలు సమర్పించాలని ఎన్నికల అధికారి గుడిమెట్ల బాలసైదులు సూచించారు. రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే నమోదైన మండల సంఘాలు, క్లబ్‌ల బాధ్యులు వివరాలు సమర్పించాలని, వివరాలకు కె.క్రిస్టోఫర్‌బాబు 73966 69337 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కల్లూరు ఎస్‌ఈ వాసంతికి సీఈగా పదోన్నతి
● ఈ స్థానంలో శ్రీకాంత్ నియామకం
ఖమ్మంఅర్బన్: జలవనరులశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎస్‌ఈలు, ఇతర కేడర్ల అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కల్లూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) జి.వాసంతికి సైతం చీఫ్ ఇంజనీర్ పదోన్నతి లభించింది. ఈ స్థానంలో జి.శ్రీకాంత్‌ను ఎస్‌ఈగా నియమించారు. ఆయన ప్రస్తుతం కల్వకుర్తి ఐడీ–6లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా ఎస్‌ఈగా పదో న్నతి కల్పించి కల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు.
అధిక సాంద్రత పద్ధతిలో అధిక దిగుబడి
రఘునాథపాలెం: అధిక సాంద్రత, దగ్గర సాళ్ల పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ఉచిత పత్తి విత్తనాల పంపిణీని రఘునాథపాలెం రైతువేదికలో ఆయన గురువారం ప్రారంభించి, ప్రసంగించారు. ఈ విధానంలో పత్తి మొక్కలు ఒకేసారి పూత, కాయ దశకు వస్తాయని, కాయలు ఒకేసారి పక్వానికి రావడంతో కోత, ఏరడం సులభమవుతుందని తెలిపారు. అంతేకాక నవంబర్ చివరి నాటికి పంట కాలం పూర్తయి.. అపరాలు లేదా నూనెగింజల పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సరిత, డీఏఓ కొంగర వెంకటేశ్వరరావు, ఆత్మ, సొసైటీ చైర్మన్లు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురాం, ఏఓ కర్నాటి ఉమామహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
బోధన, భోజనం
అమలుపై ప్రత్యేక శ్రద్ధ
బోనకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేయడమే కాక మధ్యాహ్న భోజనం అమలుపైనా శ్రద్ధ వహించాలని డీఈఓ సదానందం సూచించారు. బోనకల్ ఎంఆర్సీ భవనంలో గురువారం ఆయన మండలంలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. విద్యార్థులను చేర్పించడంతో పాటు వంద శాతం హాజరయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ఎంఈఓ దామాల పుల్లయ్య, హెచ్‌ఎంలు గోపీచంద్, ముంతాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.


