తెలంగాణ పురావస్తు శాఖతో ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ పురావస్తు శాఖతో ఎంఓయూ

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ పురావస్తుశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు హైదరాబాద్‌ నాంపల్లిలోని పురావస్తు శాఖ మ్యూజియంలో శాఖ డైరెక్టర్‌ నాంపల్లి అర్జున్‌ రావు, కళాశాల అధ్యాపకురాలు డాక్టర్‌ విజయలక్ష్మి గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కళాశాల విద్యార్థులకు చారిత్రక వారసత్వ పరిరక్షణ, వారసత్వ పరిశోధన, పురావస్తు అధ్యయన పర్యటనలు, శిక్షణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్‌ ఎన్‌.గోపి తెలిపారు.

వైభవోపేతంగా

ధ్వజ స్తంభాల ప్రతిష్ఠ

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు గురువారం నాలుగు రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అర్చకులు యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత అలివేలు మంగ, పద్మావతి, సోమేశ్వరస్వామి వారి ఆలయాల జీర్ణోద్ధరణ, ధ్వజ స్తంభాల ప్రతిష్ఠాపనను వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్తిచేశారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.వీరస్వామి, ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, దాత తుళ్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా డెయిరీని పరిశీలించిన ఢిల్లీ బృందం

బోనకల్‌: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్‌ను ఢిల్లీకి చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీపీ) బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డెయిరీకి కేటాయించిన 9.20 ఎకరాల స్థలంలో మట్టి, నీటి నమూనాలు సేకరించి నిర్మాణానికి అనువుగా ఉంటుందా, లేదా అని ఆరా తీశారు. అలాగే, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు సభ్యులు సుందర్‌రావు, డాక్టర్‌ అభిజిత్‌, డాక్టర్‌ రాజేశ్వరి, డాక్టర్‌ అంజనా స్నేహ, డాక్టర్‌ అరుణ్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, ఏపీడీ జయశ్రీ, ఏపీఓ లక్ష్మీనర్సింహారావు, లక్ష్మణ్‌రావు, తహసీల్దార్‌ సుధాకర్‌, డెయిరీ అధ్యక్ష, కార్యదర్శులు లలిత, చాంద్‌బీ పాల్గొన్నారు.

కొనసాగుతున్న

పెట్టుబడి సాయం జమ

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతుభరోసా పథకం ద్వారా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు గురువారం నాలుగెకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. జిల్లాలో 2,98,513 మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.255.75 కోట్లు జమ అయ్యాయని డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం నియోజకవర్గంలో 16,197 మందికి రూ.14.69 కోట్లు, పాలేరు నియోజకవర్గంలో 71,029 మంది రైతులకు రూ.58.08 కోట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 74,682 మంది రైతులకు రూ.62.19 కోట్లు, మధిర నియోజకవర్గంలో 78,832 మంది రైతులకు రూ.66.28 కోట్లు, వైరా నియోజకవర్గంలో 56,673 మంది రైతులకు రూ.53.78 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలోని 1,100 మంది రైతులకు రూ.73 లక్షలు అందాయని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement