● క్వింటా ధర రూ.22 వేల దరిదాపుల్లోకి.. ● దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల ప్రభావం ● మోడల్ మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో కదలిక వచ్చింది. ఎగుమతులకు అనుకూలమైన ‘తేజా’ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. పంట సీజన్ మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటాకు రూ.21 వేల వరకు పలికిన ధర జూన్‌లో రూ.21,500లకు చేరింది. ఇక గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జెండా పాట ధర రూ.21,900, మోడల్ ధర రూ.20,500గా పలికింది. గత ఏడాది సగటున రూ.15 వేలు దాటకపోగా ఈసారి మాత్రం తేజా రకానికి డిమాండ్ పెరిగింది. అయితే, గత ఏడాది ఆశించిన ధర లేని కారణంగా ఈసారి రైతులు సాగు విస్తీర్ణం తగ్గించడంతో ధరకు రెక్కలు వస్తున్నాయని భావిస్తున్నారు.
ఎగుమతులు కూడా..
‘తేజా’ మిర్చికి ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు బంగ్లాదేశ్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగా వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఏటా చైనాకు ఎగుమతి చేసే వ్యాపారులకు ఈసారి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేవు. దీంతో దేశీయ మార్కెట్‌పై ఆధారపడి కొనుగోలు చేస్తుండగా, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు రావడం ధర పెరుగుదలకు కారణమైంది. సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.వేయి ఎక్కువ పలుకుతుండగా, మరింత పెరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఇక వానాకాలం సాగు సీజన్ కావడంతో రైతులు పెట్టుబడుల కోసం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ధర రూ.22 వేల దగ్గరకు చేరడంతో ఇంకొందరు రైతులు మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం.
ఒక షెడ్‌లో కొనుగోళ్లు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్‌లో గురువారం నుంచి మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఓ పక్క పనులు కొనసాగుతున్నా, వ్యాపారుల వినతితో ఆరో నంబర్ షెడ్డును సిద్ధం చేసి కొనుగోళ్లకు మార్కెట్ కమిటీ అవకాశం కల్పించింది. తొలిరోజు జెండాపాటతో ప్రారంభించారు. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేశ్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావుతో పాటు బత్తిని నరసింహారావు, బాదె రవి, యడ్లపల్లి సతీశ్, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


