● హామీలు నెరవేర్చలేక కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు ● ఎమ్మెల్సీలు రవీందర్‌రావు, మధు
ఖమ్మంమయూరిసెంటర్: అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై అపవాదులు వేయడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ నేతలు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో మొదటి స్థానాన నిలపడమే కాక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం అప్పులు చేశామే తప్ప సంపదను వృథా చేయలేదని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ మాత్రం రైతు భరోసా, యాసంగి సాయం, రుణమాఫీ, బోనస్ అమలు చేయకపోగా, యూరియా సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు. వీటిపై చర్చ జరగొద్దనే కుట్రతోనే ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ.. హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మంత్రులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అయితే, వారి బెదిరింపులకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నాయకులు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, షేక్ మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, బిచ్చాల తిరుమల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


