● యాప్ ద్వారా బుకింగ్, కొనుగోళ్లు ● ఇప్పటివరకు 1,60,316 బస్తాల అమ్మకం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో వానాకాలం సాగుకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య వెల్లడించారు. నిల్వలు, యాప్ ద్వారా బుకింగ్‌కు ఉన్న అవకాశాలు, ఇప్పటివరకు అమ్మకాల వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం జిల్లాకు 35,267 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటి వరకు యాప్ ద్వారా 56,926 మంది రైతులు 1,80,738 బస్తాల కోసం బుక్ చేసుకోగా, 1,60,316 బస్తాలు కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రైతులు కూడా యాప్ ద్వారా బుక్ చేసుకుని, సులువుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. ప్రతీ మండల పరిధి పీఏసీఎస్‌ల్లో యూరియా నిల్వలు ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.


