శానిటేషన్‌.. పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

శానిటేషన్‌.. పరేషాన్‌

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

మురుగు కాల్వలు..

రోడ్లపై నీళ్లు

డ్రెయినేజీలు సరిగ్గా లేక రోడ్లపైనే నీరు

వర్షాలు పెరిగితే వ్యాధుల భయం

ఇప్పటికే రెండు డెంగీ కేసులు,

ఒకరి మృతి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపరీతమైన ఎండల అనంతరం అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో వాతావరణం కాస్త చల్లపడుతోంది. ఇదే సమయాన వర్షాలతో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా ప్రబలే ప్రమాదముంది. జిల్లాలోని పలు గ్రామపంచాయతీలతోపాటు మండల, పట్టణ కేంద్రాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో నీరు రహదారులపై నిలిచి దోమల వృద్ధికి కారణమవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడమే కాక డెంగీ పంజా విసరకముందే వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాల్సిన అవసరముంది.

ముందస్తు చర్యలతోనే..

పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడితేనే వ్యాధుల కట్టడి సాధ్యమవుతుంది. జిల్లాలో ఇంకా వర్షాలు ఊపందుకోలేదు. ఈ క్రమంలోనే డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, సిల్ట్‌ తొలగింపు పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెత్తాచెదారం తొలగించాలి. ఇందుకోసం ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహిస్తే భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు ఉండవు. ఏటా మున్సిపల్‌, కార్పొరేషన్‌ అధికారులు ఫ్రై డే – డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా మొదలుపెట్టి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు.

డెంగీ కేసులు నమోదు

ఏటా జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలడం ఆనవాయితీగా వస్తోంది. చెత్తాచెదారం నిల్వతో దోమలు ప్రబలి అంటువ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అంతేకాక మలేరియా, డయేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన ఓ వ్యక్తి ఇతర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుండగా డెంగీ సోకి గతనెల 18న మృతి చెందాడు. అలాగే, కారేపల్లిలోని భరత్‌నగర్‌ కాలనీలోనూ గత నెల 19న డెంగీ కేసు నమోదైంది. ఈక్రమాన కేసులు మరింత పెరగకముందే మున్సిపల్‌, కార్పొరేషన్‌, వైద్యశాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముంది.

కీలక ప్రాంతాలపై దృష్టి

అంటువ్యాధులు సంక్రమించేందుకు కారణమయ్యే ప్రాంతాలపై సిబ్బంది దృష్టి సారిస్తే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వరద నీటితో పాటు ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు నెలల తరబడి నిలిచి ఉంటోంది. ఇలాంటి ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇక మున్నేటి వరద ఏటా ఖమ్మం నగరాన్ని వణికిస్తోంది. వరద అకస్మాత్తుగా రావడంతో గత రెండేళ్లుగా మున్నేరు పరీవాహక ప్రాంత కాలనీలు అతలాకుతలం అయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగాశానిటేషన్‌ సిబ్బందిని సిద్ధం చేసినా మరింత మెరుగైన చర్యలు చేపట్టకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముంది.

జిల్లాలోని 571 గ్రామపంచాయతీలకు ఇటీవలే పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యాన వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామపంచాయతీల్లో 2,103 మంది శానిటేషన్‌ సిబ్బంది పని చేస్తుండగా, 1,480 కి.మీ. డ్రెయినేజీలు ఉన్నాయి. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలాచోట్ల చెత్తాచెదారం నిండి భారీ వర్షాలు కురిస్తే నీరు ముందుకు సాగక రోడ్లపైకి చేరనుంది. ప్రస్తుత వర్షాలతో ఇదే పరిస్థితి ఎదురవుతుండగా, రోడ్డు పక్కన ఉన్న చెత్త కూడా తొలగించకపోవడంతో అది కుళ్లి దోమలు వృద్ధి చెందుతున్నాయి.

పలు ప్రాంతాల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement