అంతకు మించి.. | - | Sakshi
Sakshi News home page

అంతకు మించి..

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

ఇప్పటి వరకు ప్రధాన పంటల సాగు (ఎకరాల్లో)

11మండలాల్లో అధిక వర్షపాతం

ఇంకొన్ని చోట్ల సాధారణం..

మిగిలిన చోట్ల లోటు

అనుకూలించిన వానలతో

జోరుగా పంటల సాగు

పంట అంచనా సాగు

పత్తి 2,36,908 1,60,058

వరి 3,05,366 7,753

మొక్కజొన్న 4,225 155

చెరకు 1,181 842

పెసర 18,174 9.809

కంది 451 64

ఖమ్మంవ్యవసాయం: గడిచిన జూన్‌లో జిల్లాలో సగటు వర్షపాతం సాధారణానికి మించి నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో చాలా జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నమోదైనా జిల్లాపై మాత్రం వరుణుడు కరుణ కనబరిచాడు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, సూర్యాపేటతో ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.లు కాగా, 28.8శాతం అధికంగా 168.9 మిల్లీమీటర్లుగా నమోదైంది.

అన్నిచోట్ల కాదు...

జిల్లాలోని 21 మండలాలకు గాను 11మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ జాబితాలో బోనకల్‌, ఏన్కూరు, చింతకాని, ముదిగొండ, తల్లాడ, కల్లూరు, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌, వైరా, పెనుబల్లి, కామేపల్లి మండలాలు ఉన్నాయి. ఇక మధిర, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌, తిరుమలాయపాలెం, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన కూసుమంచి, సింగరేణి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక లోటు నమోదైంది.

గత జూన్‌తో పోలిస్తే బాగు

గత ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్‌ సగటు వర్షపాతం 131.2 మి.మీ.కు గాను గత ఏడాది ఈ నెలలో 123.9 మి.మీ. నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం 168.9 మి.మీ.గా నమోదు కావడం విశేషం. బోనకల్‌ మండలంలో 118.6 శాతం, ఏన్కూరు మండలంలో 110.3 శాతం, చింతకాని మండలంలో 92.1 శాతం, ముదిగొండ మండలంలో 88.3 శాతం, తల్లాడ మండలంలో 80.4 శాతం, కల్లూరు 79 శాతం, నేలకొండపల్లి మండలంలో 69.6 శాతం, ఖమ్మం రూరల్‌ మండలంలో 45.6 శాతం, వైరా మండలంలో 40.6 శాతం, పెనుబల్లి మండలంలో 27.6 శాతం, కామేపల్లి మండలంలో 24.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

సాగు సంబురం

జిల్లాలో అనుకూలించిన వానలతో మెట్ట పంటల సాగు వేగం పుంజుకుంది. ఈ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 5,67,154 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో జూన్‌ 30 నాటికి 1,78,685 ఎకరాల్లో సాగయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అధికంగా పత్తి విత్తనాలు 1,60,058 ఎకరాల్లో నాటగా, పెసర 9,809 ఎకరాల్లో వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సాగుకు అనుకూలంగా ఉండడంతో పత్తి సాగు విస్తీర్ణం పెరగడమే కాక వరి నార్లు సిద్ధం చేసుకోవడంపై రైతులు దృష్టి సారించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement