మెరుగైన ఫలితాల్లో ఉపాధ్యాయులే కీలకం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఫలితాల్లో ఉపాధ్యాయులే కీలకం

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే విద్యార్థులకు మెరుగైన విద్య అందడంతో పాటు ఉత్తమ ఫలితాలు నమోదవుతాయని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యారంగంలో జిల్లాను ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, హాజరు, యూనిఫారాల పంపిణీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరుపై ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ.. అన్ని తరగతుల్లో విద్యార్థుల ప్రవేశాలు, హాజరు పెరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఎంఈఓలు తమ పరిధిలోని ప్రతీ పాఠశాలను తరచూ సందర్శించడం ద్వారా పరిస్థితులు మెరగువుతాయని చెప్పారు. విద్యార్థులు సొంతంగా చదవడం, మాట్లాడడమే కాక నేర్చుకున్న విషయాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇన్‌చార్జ్‌ డీఈఓ సదానందం, విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌ రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళిక

విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, వరదల సమయాన ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని తెలిపారు. డీఆర్‌ఓ రామ్మూర్తి, కలెక్టరేట్‌ ఓఎస్డీ వెంకటేశ్వర్లు, అగ్నిమాపక శాఖాధికారి రామిరెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బిటన్‌సింగ్‌, ఉద్యోగులు సందీప్‌రెడ్డి, ఆంజనేయులునాయక్‌ పాల్గొన్నారు.

‘సర్‌’లో బీఎల్‌ఏలు పాల్గొనాలి

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏ)లు పాల్గొని ఉద్యోగులకు సహకరించాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌తో కలిసి ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, నింపడంపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ 95.78 శాతం పూర్తయిందని చెప్పారు. ఎస్‌డీసీ సదానందం, డీటీ అన్సారీ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్‌ దివాకర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement