● రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి ● పలు మండలాల్లో ఫారాల పంపిణీ పరిశీలన
కొణిజర్ల/వైరా రూరల్/కూసుమంచి: సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ(సర్)లో భాగంగా బీఎల్‌ఓలు తప్పనిసరిగా ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. జిల్లాలోని కొణిజర్ల, వైరా, కూసుమంచి మండలాల్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం తనికెళ్ల, వైరా మండలం కేజీ సిరిపురంలో పరిశీలించాక ఆయన మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో వైరా డివిజన్ ముందంజలో ఉందని తెలిపారు. అనంతరం మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, మృతులు, గ్రామంలోని వారిని గుర్తిస్తున్న తీరుపై సమీక్షించారు. అంతేకాక ఓటర్లతో మాట్లాడి బీఎల్‌ఓల పనితీరుపై ఆరా తీశారు. ఈకార్యక్రమాల్లో తహసీల్దార్ ఎన్.అరుణ, ఉద్యోగులు రమేష్, రామచంద్రరావు, రవి, సర్పంచ్‌లు గడల కళావతి,శెట్టిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలం జుజుల్‌రావుపేటలో ఫారాల పంపిణీని పరిశీలించిన రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా ఫారాలు నింపి అందజేయాలని సూచించారు. తహసీల్దార్ సైదులు, ఈఆర్‌ఓ సదానందం, ఉద్యోగులు రవీందర్, జ్యోతి, రవిశంకర్, నాగమణి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) గోదాంను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వరరెడ్డి.. కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి తనిఖీ చేశారు. గోదాం వద్ద భద్రత, యంత్రాలు భద్రపరిచిన గదుల సీళ్లను పరిశీలించి సూచనలు చేశారు. ఎస్‌డీసీ సదానందం, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.


