ఆన్‌లైన్‌లో పోస్టాఫీస్‌! | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పోస్టాఫీస్‌!

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

ఐపీపీబీ ఖాతా ఉంటే

అనేక సౌకర్యాలు

అందుబాటులో మొబైల్‌ యాప్‌ కూడా..

చెల్లింపులు, ప్రభుత్వ పథకాలు

వినియోగించుకునే సౌలభ్యం

బ్యాంకింగ్‌ యాప్‌తో సేవలు

ఖమ్మంగాంధీచౌక్‌: వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే తపాలా శాఖ కూడా వినియోగదారులకు చేరువయ్యేలా ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్టాఫీస్‌ వద్ద క్యూలైన్లలో వేచి ఉండడం, చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన ఇబ్బంది లేకుండా అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందించేలా చర్యలు తీసుకుంది. అందరికీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరుణాన పోటీలో వెనకబడకుండా వినియోగదారుల సౌలభ్యం, సంస్థ మనుగడను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతను అంది పుచ్చుకుంటోంది. తపాలా వ్యవస్థ విస్తృతంగా ఉండడం, గ్రామగ్రామాన పోస్టాఫీస్‌లు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రతీ పోస్టాఫీస్‌లో తపాలా సేవలతో పాటు బ్యాంకింగ్‌ సేవలు కూడా అందుతున్నాయి.

ఐపీపీబీలో ఖాతా ఉంటే చాలు..

ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)లో ఖాతా కలిగి ఉంటే అన్నిరకాల తపాలా సేవలు సులభతరంగా అందుతాయి. ఇందులో రూ.200 డిపాజిట్‌తో ఖాతా తెరిచే సౌకర్యం కల్పించారు. పోస్టాఫీస్‌ల ద్వారా, పోస్ట్‌మెన్ల ద్వారా కూడా ఈ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఐపీపీబీ ద్వారా ఇంటి ముంగిట్లోకి చేరుతున్నాయి. పదేళ్ల వయస్సు నిండి, ఆధార్‌కార్డు ఉన్న వారంతా ఈ బ్యాంకులో ఖాతా తెరిచే సౌలభ్యం ఉంది.

యాప్‌తో సులభంగా..

తపాలా బ్యాంకింగ్‌ సేవలను విస్తృతపర్చడం, వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) యాప్‌ను ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్‌ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌లోని రికరింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్ల చెల్లింపు, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆర్పీఎల్‌ఐ ప్రీమియం చెల్లింపులను ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఐపీపీబీ మొబైల్‌ బ్యాంకింగ్‌ ఖాతా కలిగి ఉంటే ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌ యోజన, ఉపాధి పథకం, రైతు భరోసా, పెన్షన్ల జమ అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఖాతాలు తెరిచేలా అధికారులు ప్రచారం చేస్తున్నారు.

823 పోస్టాఫీసుల్లో సేవలు

ఖమ్మం తపాలా డివిజన్‌ పరిధి ఉమ్మడి జిల్లాలో 823 పోస్టాఫీస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఐపీపీబీ సేవలందిస్తోంది. ఐపీపీబీ ప్రధాన కార్యాలయం ఖమ్మం గాంధీచౌక్‌లో ఉండగా, ఇప్పటి వరకు 41,500 ఖాతాలు తెరిచారు. అలాగే, ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ విధానం(ఏపీఈఎస్‌)లో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో 1.20 లక్షల లావాదేవీలు జరిగాయి.

తపాలా సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ ఖాతా కలిగి ఉంటే అన్ని రకాల సేవలు అందుతాయి. మొబైల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. పొదుపు పథకాలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియమ్‌ కూడా చెల్లించవచ్చు. – వి.వీరభద్రస్వామి,

పోస్టల్‌ సూపరింటెండెంట్‌, ఖమ్మం డివిజన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement