తమ్మినేనిని పరామర్శించిన బృందాకారత్‌ | - | Sakshi
Sakshi News home page

తమ్మినేనిని పరామర్శించిన బృందాకారత్‌

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

ఖమ్మంరూరల్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడే తమ్మినేని వీరభద్రంను సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకారత్‌ బుధవారం పరామర్శించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న తమ్మినేనిని ఆమె పరామర్శించి ఆరోగ్య వివరాలు వివరాలు తెలుసుకున్నారు. త్వరగా ఆయన కోలుకుని ప్రజాజీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సీపీఎం నాయకులు ఆశాలత, బండి రమేష్‌, బండి పద్మ, మాచర్ల భారతి, మెరుగు రమణ తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు మేలు జరిగేలా సంస్కరణలు

కల్లూరురూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మేలు జరిగేలా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రంగారావు కోరారు. కల్లూరులో బుధవారం యూనియన్‌ సభ్యత్వ నమోదు నిర్వహించగా ఆయన మాట్లాడారు. విద్యారంగంలో సంస్కరణల పేరిట ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల కుదింపునకు ప్రయత్నా లు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాకాకుండా ప్రస్తుత విద్యాసంస్థలను బలోపేతం చేసి ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. పీఆర్సీ కోసం త్వరలో జేఏసీ ఆధ్వర్యాన ఆందోళనల కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాకాల రమేశ్‌, షేక్‌ చాంద్‌సాహెబ్‌తో పాటు పఠాన్‌రహీం, టి.సత్యనారాయణరెడ్డి, పోట్రు మధుసూదన్‌రావు, దంతాల సుధాకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

కుంభాభిషేకం ఉత్సవాలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవా రం యాగశాలలో చతుర్వేదపారాయణం, నవ గ్రహ హోమం, గణపతి పూజ చేయడమే కాక నూతన ధ్వజ స్తంభాలకు శుద్ధి చేశారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్ప ల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సర్పంచ్‌ తుళ్లూరు నిర్మలకుమారి, మధిర మార్కెట్‌, సొసైటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, ముల్పూరి శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నాయకులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వేజండ్ల సాయికుమార్‌ పాల్గొన్నారు.

ఎర్రుపాలెంలో ‘శాతవాహన’కు తాత్కాలిక హాల్టింగ్‌

ఎర్రుపాలెం: ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌లో శాతవాహన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గురువారం నుంచి తాత్కాలిక హాల్టింగ్‌ సౌకర్యం కల్పిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరున్న మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీవారి కుంభాభిషేక స్వర్ణోత్సవాలు జరగుతుండటంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు శాతవాహన ఎక్స్‌ ప్రెస్‌కు ఎర్రుపాలెంలో హాల్టింగ్‌ ఇవ్వగా, తా త్కాలికంగా కాకుండా నిరంతరం కొనసాగించాలని మండల వాసులు, భక్తులు కోరుతున్నారు.

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఈ పథకం కింద యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్‌, జపాన్‌, ఉత్తర కొరియా, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. కుటుంబ వార్షికఆదాయం రూ.5లక్షలు, వయస్సు 35ఏళ్లు దాటొద్దని, కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు పీజీ / పీహెచ్‌డీ కొరకు సంబంధిత కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, టోఫెల్‌, ఐఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌, పీటీఈ పరీక్షల్లో అర్హత సాధించడమే కాక విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అనుమతి పొంది ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https:// telanganaepass. cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా వచ్చే ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకుని, హార్డ్‌కాపీకి గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించిన పత్రాలు జత చేసి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సమర్పించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement