అంతర్రాష్ట్ట్ర దొంగను అరెస్ట్ చేసిన
పోలీసులు
రూ.32 లక్షల సొత్తు స్వాధీనం
ఖమ్మంక్రైం: రోజంతా నూతన భవనాలకు సెంట్రింగ్ పెట్టడం.. సమయం చిక్కితే ఎక్కడ తాళం వేసి ఇళ్లు ఉన్నాయో గుర్తించడం.. రాత్రి కాగానే అనువైన ఇంట్లో జొరబడి ఉన్నదంతా దోచుకెళ్లడం ఆయన దినచర్య. ఇలా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఖమ్మం సబ్ డివిజన్ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర, సీసీఎస్ ఏసీపీలు రమణమూర్తి, సర్వర్ వివరాలు వెల్లడించారు. మధిర మండలం ఆత్కూర్ గ్రామానికి చెందిన కంభంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేశ్‌రెడ్డి సెంట్రింగ్ పనిచేసేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆయన చోరీల బాట పట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని కిటికీల నుంచి చొరబడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించినా తీరు మార్చుకోని ఏసోబు ఖమ్మం నగరంతోపాటు వేంసూరు, వీఎం.బంజర, చిల్లకలు, తిరువూరు తదితర ప్రాంతాల్లో జరిగిన 22 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
జైలులో మరింత శిక్షణ!
పలుమార్లు జైలుకు వెళ్లిన ఏసోబు అక్కడ పాత నేరస్తులతో పరిచయం పెంచుకుని ఎక్కడెక్కడ,ఎలా చోరీ చేయాలో మెళకువలు తెలుసుకునేవాడు. ఆపై జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ చోరీలు మొదలుపెట్టేవాడు. ఈ క్రమాన ఖమ్మంకిన్నెర హోటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏసోబును అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం బయట పడింది. ఈ సందర్భంగా రూ.32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40 వేలవిలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఓ చంద్రహారం ప్రైవైట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. కాగా,సోనోవిజన్‌లో చోరీకి పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటామని, గాంధీచౌక్‌లోని చోరీకేసులో రికవరీపై దృష్టి సారించామని ఏసీపీలు తెలిపారు. సమావేశంలో సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొనగా, నిందితుడిని అరెస్ట్‌చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐలు వంశీ, రమేశ్, ఉద్యోగులు కె.శ్రీనివాస్, నర్సింహారావు, సుధీర్, సుందర్‌ను అభినందించారు.


