వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

కొణిజర్ల: పొలానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లిన ఘటన మండలంలోని అమ్మపాలెంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన తేజావత్‌ లక్ష్మి కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు బంధువు మోటార్‌ సైకిల్‌పై వచ్చింది. రాజ్యాతండా వద్ద దిగి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాగారు. ఈ మేరకు లక్ష్మి ప్రతిఘటించగా రూ.2 లక్షల విలువైన నల్లపూసలతో అల్లిన బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు.

అభయాంజనేయ స్వామి ఆలయంలో నగదు..

కల్లూరురూరల్‌: కల్లూరు సమీపాన గనియతండాలోని శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ గ్రిల్స్‌ పగలగొట్టి లోనకు ప్రవేశించి హుండీ తాళం పగల గొట్టారు. అందులో ఉన్న సుమారు రూ.32వేల నగదుతో పాటు స్వామికి భక్తులు సమర్పించిన 20 గ్రాముల వెండి కళ్లు కూడా ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్‌ బానోతు రంజిత్‌ ఫిర్యాదుతో కల్లూరు ఎస్‌ఐ హరిత పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

అప్పుల బాధతో

రైతు ఆత్మహత్య

తల్లాడ: వ్యవసాయ అవసరాలకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గాదె మురళి (35).. తనకున్న మూడెకరాలకు తోడు మరో ఐదెకరా లు కౌలుకు తీసుకుని గత ఏడాది మిర్చి, పత్తిసాగు చేశా డు. అయితే, సరైన దిగుబడి రాక రూ.5లక్షల అప్పు మిగిలింది. ఈ అప్పు తీర్చే మార్గం లేక మూడు రోజు లుగా బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద పురుగులమందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మురళి తండ్రి రామచంద్రం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలుడి

ఆత్మహత్యాయత్నం

నేలకొండపల్లి: మండలంలోని ఆచార్లగూడెం గ్రామానికి చెందిన బాలుడు (14) బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ఎలుకల మందు మింగగా, గమనించిన కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, బాలుడి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement