ఖమ్మంమయూరిసెంటర్: పేదలను వంచిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు హెచ్చరించారు. నివాస స్థలాలు లేక పేదలు ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోకుండా కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. నివాస స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలను విస్మరించిన కారణంగానే ప్రజలు తిరస్కరించారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథా అవలంబిస్తోందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాలు లేక పేదలు ఇబ్బంది పడుతుండగా, ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే కూల్చివేస్తున్నారని తెలిపారు. ఇకనైనా కూల్చిన చోటే పేదలకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయాన ఖమ్మంలోని ఎన్నెస్పీ స్థలాలు, ప్రభుత్వ భూములను సంపన్నులు ఆక్రమిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, వామపక్ష పార్టీల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, బీ.జీ.క్లెమెంట్, జానీమియా, మాదినేని రమేశ్, యర్రా బాబు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బొంతు రాంబాబు, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నాలో
సీపీఐ నేత హేమంతరావు


