చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

వేంసూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని మర్లపాడుకు చెందిన బర్ల పుల్లయ్య (71) గతనెల 28న మర్లపాడులోని తిరువూరు రోడ్డు నుంచి మర్లపాడు వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే మార్గంలో బైక్‌పై వెళ్తున్న నాగరాజు వెనుక నుంచి పుల్లయ్యను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గాయపడిన జీపీ కార్మికుడు..

సీఎం సభ ఏర్పాట్ల కోసం వెళ్లివస్తుండగా ప్రమాదం

కల్లూరురూరల్‌: చింతకాని మండలంలో సీఎం సభ ఏర్పాట్లకు వెళ్లివస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రామపంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం మర్లపాడు గ్రామపంచాయతీ కార్మికుడు చాదిరాసుపల్లి పుల్లయ్య (45) మత్కేపల్లి క్రాస్‌ వద్ద నిర్వహించతలపెట్టిన సీఎం సభ ఏర్పాట్లకు సహాయకుడిగా వెళ్లాడు. అక్కడి సభ రద్దు కావడంతో గత ఆదివారం రాత్రి ఆయన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మర్లపాడు వద్ద గేదె అడ్డు రావడంతో కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లయ్యకు ఖమ్మంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమంచి బుధవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పుల్లయ్య మృతదేహం వద్ద ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది నివాళులర్పించారు.

బైక్‌కు రుణం తీసుకుంటే

గేదె రుణం కట్టాలని నోటీసు!

నేలకొండపల్లి: రుణం తీసుకోకపోయినా, వెంటనే చెల్లించకపోతే జప్తు చేయాల్సి వస్తుందని పీఏసీఎస్‌ అధికారులు నోటీసు జారీచేసిన వైనమిది. నేలకొండపల్లి పీఏసీఎస్‌ ద్వారా మండలంలోని రాయగూడెంకు చెందిన కోసూరి రాజబాబు ద్విచక్ర వాహనానికి రుణం తీసుకున్నాడు. అందులో కొంత చెల్లించగా, ఇంకొంత బకాయి ఉంది. అయితే, అధికారులు మాత్రం గేదె కొనుగోలు తీసుకున్న రుణం వడ్డీతో సహా రూ.74,329 చెల్లించాలని నోటీసు జారీ చేశారు. దీంతో రాజబాబు బుధవారం సొసైటీ మాజీ డైరెక్టర్‌ పోలంపల్లి నాగేశ్వరరావుతో కలిసి చైర్మన్‌ తీగ రమణయ్యను కలిశారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించాక సాంకేతిక లోపంతో నోటీసులు జారీ అయ్యాయని, సరిచేస్తామని చెప్పడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement