చేయూత దక్కుతుందా ?! | - | Sakshi
Sakshi News home page

చేయూత దక్కుతుందా ?!

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

● పెన్షన్ల కోసం జిల్లాలో వేలాది దరఖాస్తుల పెండింగ్‌ ● మూడున్నరేళ్లుగా మంజూరుకు దక్కని మోక్షం ● మరోపక్క నగదు పెంపుపై లబ్ధిదారుల్లో ఆశలు

పెంపుపై సందిగ్ధత

● పెన్షన్ల కోసం జిల్లాలో వేలాది దరఖాస్తుల పెండింగ్‌ ● మూడున్నరేళ్లుగా మంజూరుకు దక్కని మోక్షం ● మరోపక్క నగదు పెంపుపై లబ్ధిదారుల్లో ఆశలు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే జిల్లాలో అర్హులైన పలువురు పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూడక తప్పడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా కొత్త పింఛన్లు మంజూరులో జాప్యం జరుగుతుండడం.. ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా ఫలితం లేకపోవడంపై అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే పథకం పేరును చేయూతగా మార్చినా మంజూరు కాక సుమారు 18 వేల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. త్వరలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లోనైనా కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రకటన చేయాలని దరఖాస్తుదారులు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నగదు పెంచాలని ప్రస్తుత లబ్ధిదారులు కోరుతున్నారు.

ఎదురుచూపులు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో చేయూత పింఛన్ల పెంపు పథకం కూడా అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 తగ్గింపు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే పేదలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తోంది. త్వరలో దివ్యాంగులకు సైతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. అయితే, ఆసరా పింఛన్లను చేయూత పథకం కింద రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

మూడేళ్లకు పైగా..

రాష్ట్రంలో కొత్త పింఛన్లు మూడేళ్లుగా మంజూరు చేయడం లేదు. 2022 ఆగస్టులో గత ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేశాక.. మళ్లీ ఇప్పటివరకు దస్త్రం కదలలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పేరును ‘చేయూత’ అని మార్చగా, పింఛన్ల్‌ కోసం వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కాగా, ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులు, అనర్హులవి వేరు చేసి.. ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేసినా జాబితా విడుదల చేయసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

18వేలకు పైగానే...

జిల్లాలో చేయూత పింఛన్ల కోసం 18వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వృద్దులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అందిన దరఖాస్తులు ఇందులో ఉండగా.. తమకు ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అధికారులు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు.

ప్రభుత్వం చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు నగదు పెంచుతామని ప్రకటించినా అమలుకు నోచుకోవడంలేదు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను ఏటా రూ.500 చొప్పున పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రూ.2016 పెన్షన్‌ రూ.2,500లకు, రూ.4 వేల పెన్షన్‌ రూ. 4,500లకు చేరుతుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు మంజూరు చేయాల్సి వస్తే ఈ ఏడాది కూడా పెంపు ఉండకపోవచ్చనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏదిఏమైనా ఈనెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశాలపై స్పష్టత రానుంది. కాగా, జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి ప్రస్తుతం 1,82,752 మంది లబ్ధిదారులు ఉండగా, వీరికి నెలకురూ.42.34 కోట్లు మేర పింఛన్‌ అందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement