‘పుర’పోరు.. ప్రచార హోరు
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో హోరాహోరీ ప్రచారం
మిగతా నాలుగు రోజులు తారాస్థాయికి..
రంగంలోకి రాజకీయ పార్టీల
ముఖ్యనేతలు
ప్రచారంలోకి అగ్రనేతలు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరఫున ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్యే నెలకొంది. వీటితో పాటు సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు రంగంలోకి దిగారు.
మనది ఈ ‘గుర్తే’..
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను పలకరిస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పులు, మైకులతో వీధులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో అభ్యర్థులు వారితో మాట కలిపి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాక తమ గుర్తుతో కూడిన పోస్టర్లు చూపిస్తూ ‘గుర్తుంచుకోండి’ అని కోరుతున్నారు.
జెండా కట్టు.. మైకు పెట్టు
ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వీధులన్నీ పార్టీల జెండాలతో కళకళలాడుతున్నాయి. వాహనాలకు జెండాలు, ఫ్లెక్సీలు, మైకులు అమర్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో ఉన్న పోస్టర్లు, ఫ్లెక్సీలను కూడళ్లలో ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయాన ప్రచారానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు.
నాలుగు రోజుల్లో చుట్టేసేలా..
ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఇన్నాళ్లు టికెట్ సాధించడం, రెబల్స్‌కు నచ్చజెప్పడంతో బిజీగా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంలో వేగం పెంచారు. మిగిలిన నాలుగు రోజుల్లో డివిజన్, వార్డులోని ప్రతీ గల్లీని చుట్టేయడం, ఓటర్లందరికీ కలవడమే లక్ష్యంగా ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. ఓసారి అభ్యర్థి వచ్చివెళ్లగానే.. వారికి సంబంధించిన ప్రచార వాహనాన్ని ఆ గల్లీకి పంపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తుండగా.. బీఆర్‌ఎస్ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు ప్రస్తుతం అభివృద్ధి జరగడం లేదంటూ ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ తదితర పార్టీలు కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నాయి.
గల్లీగల్లీని చుట్టేస్తున్న అభ్యర్థులు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఏదులాపురం, కల్లూరు, అశ్వారావుపేట, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచార బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. వైరాలో పువ్వాడ, తాతా మధు, మధిరలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటిస్తుండగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్ తరుపున వద్దిరాజు రవిచంద్ర ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మహిపాల్‌రెడ్డి, ఇతర నాయకులు, సీపీఐ నుంచి కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు ప్రచారంలో నిమగ్నమయ్యారు.


