హైవేలపై ప్రమాద ప్రదేశాల గుర్తింపు ఎలా?
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యా న వాటిని ఎలా గుర్తిస్తున్నారు, అక్కడ ఎలాంటి నివారణ చర్యలు చేపడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రశ్న లేవనెత్తారు. ఇందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఆధారంగా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని తెలిపారు. మరణాలు లేదా తీవ్ర గాయాలకు దారి తీసే నిర్దిష్ట సంఖ్యలో ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా తేలుస్తున్నామని వెల్లడించారు. అంతేకాక ప్రమాదాల సమాచారాన్ని పొందుపరిచి విశ్లేషించేలా ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ప్రమాదాల వివరాలు ఒకే వేదికపై నమోదవుతాయని, తద్వారా ప్రమాదాల నివారణ చర్యల అమలు, పర్యవేక్షణ సులభం కానుందని.. దీంతో పాటు బీమా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందు కు ఉపయోగపడుతుందని గడ్కరీ వివరించారు.
తపాలా శాఖ ఆధ్వర్యంలో లేఖా రచన పోటీలు
సర్కిల్, జాతీయ స్థాయిలో బహుమతులు
ఖమ్మంగాంధీచౌక్: యూనివర్సల్ పోస్టల్ యూనియన్(యూపీయూ) ఆధ్వర్యాన ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా యువత కోసం అంతర్జాతీయ లేఖల రచన పోటీలు నిర్వహించనున్నారు. ‘డిజిటల్ ప్రపంచంలో మానవ సంబంధాలు ఎందుకు ముఖ్యం’ అన్న అంశంపై స్నేహితులను ఉద్దేశిస్తూ లేఖ రాయాల్సి ఉండగా, 9 – 15 ఏళ్ల వయసు విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇంగ్లిష్‌లో లేదా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏ భాషలోనైనా రాసే అవకాశముండగా, లేఖ 800 పదాలకు మించకుండా ఉండాలి. సర్కిల్ స్థాయిలో ముగ్గురు విజేతలకు వరుసగా రూ.25వేలు, రూ.10 వేలు, రూ.5వేల బహుమతి అందిస్తారు. అలాగే, జాతీయ స్థాయిలో ముగ్గురికి రూ.50వేలు, రూ.25 వేలు, రూ.10 వేల నగదు బహుమతి అందుతుంది. అంతేకాక జాతీయ స్థాయిలో ఉత్తమ లేఖను అంతర్జాతీయ స్థాయి పోటీలకు భారత్ అధికారిక ఎంట్రీగా పంపిస్తారు. ఈమేరకు విద్యార్థులు తమ లేఖలను పాఠశాలల ద్వారా మార్చి 9వ తేదీ లోగా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి అందేలా పంపించాలని, ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు.
ఫౌండేషన్ కోర్సు
ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన రెసిడెన్షియల్ పద్ధతిలో ఐదు నెలల పాటు ఇచ్చే ఫౌండేషనల్ కోర్సు ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులను ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధ్యయన కేంద్రం జిల్లా సంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈమేరకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన గ్రూప్స్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, బ్యాంకింగ్ మొదలైన పోటీపరీక్షలకు భోజన, వసతితో 100 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఐదు నెలల బేసిక్ ఫౌండేషన్ శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు 75శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు కలిపి 15 శాతం, అన్ని కేటగిరీల్లో మహిళలకు 33.3 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98667 26277, 79819 88667 నంబర్లలోసంప్రదించాలని సూచించారు.
నాలుగు కొత్త కార్మిక
కోడ్ల అమలు
ఖమ్మం సహకారనగర్: గత ఏడాది నవంబర్ 21 నుంచి నాలుగు కొత్త కార్మిక కోడ్లు అమలులోకి వచ్చాయని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వై.డీ.శ్రీనివాస్ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి, నాలుగు కార్మిక కోడ్లను రూపొందించిందని వెల్లడించారు. ఇందులో వేతనాల కోడ్–2019, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, సామాజిక భద్రత కోడ్–2020తో పాటు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశ పరిస్థితుల కోడ్–2020 ఉన్నాయని తెలిపారు. ఈ కోడ్లు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. కార్మికుల సంక్షే మం, వ్యాపార సౌలభ్యం మధ్య సమతుల్య తను కాపాడుతూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ఉన్న వీటి ద్వారా అందే ప్రయోజనాలను యజమానులు, ఉద్యోగులు వినియోగించుకో వాలని కమిషనర్ ఓ ప్రకటనలో సూచించారు.


