చేయి ఎత్తిన పల్లెలు!
చేగొమ్మ.. చెరో సగం
ఏకగ్రీవాలు, ఎన్నికల జరిగిన జీపీల్లో మండలాలు, పార్టీల వారీగా మద్దతుదారుల బలాబలాలు
● మలివిడతలోనూ మెజార్టీ జీపీలు కాంగ్రెస్ కై వసం ● 113 స్థానాల్లో విజయం ● కాంగ్రెస్ పొత్తుతో సీపీఐకి నాలుగు పంచాయతీలు ● బీఆర్‌ఎస్‌కు 42, సీపీఎంకు 13
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మలివిడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లోని గ్రామపంచాయతీల్లోనూ సర్పంచ్‌లుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ, కామేపల్లి మండలాల్లోని 183 గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. 23గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా160 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌కు 95, బీఆర్‌ఎస్‌కు 39, సీపీఎం మద్దతుదారులు 13స్థానాలు దక్కించుకున్నారు. ఇక సీపీఐకి ఒకటి, ఇతరులకు 11 స్థానాలు దక్కాయి. ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన జీపీలు కలిపి మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 113పంచాయతీలు, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 42, సీపీఎం 13, సీపీఐ 4, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకోవడంతో పట్టుఉన్న చోట సత్తా చాటారు.
ఏకగ్రీవాలతో కాంగి‘రేసు’..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండతో పాటు కామేపల్లి మండలాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ దఫాలో ఏకగ్రీవమైన 23 జీపీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏకగ్రీవ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు 18, బీఆర్‌ఎస్, మాస్‌లైన్‌కు ఒక్కొక్కటి, సీపీఐకి మూడు స్థానాలు దక్కాయి.
‘హస్తం’ హవా
మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవాలతో కలిసి 113స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పల్లె జనం జై కొట్టినట్లు కనిపించింది. ఇక సీపీఐ కామేపల్లి మండలంలో ఒక్క స్థానమే దక్కించుకుంది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.
కలిసి వచ్చిన పొత్తు
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి బరిలో నిలవగా రెండు పార్టీలు కలిపి 53స్థానాల్లో పాగా వేశాయి. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్వగ్రామం కూసుమంచి మండలం రాజుపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. అలాగే ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్వగ్రామం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోనూ బీఆర్‌ఎస్ పొత్తుతో సీపీఎం గెలుపొందింది.
కూసుమంచి: మండలంలోని చేగొమ్మ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠకు రాత్రి పొద్దు పోయాక తెరపడింది. ఇక్కడ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారుడిగా బొల్లికొండ వెంకన్న, బీఆర్‌ఎస్ మద్దతుదారుడిగా బత్తుల వీరస్వామి పోటీపడ్డారు. అయితే, ఇద్దరికీ సమానంగా 945 ఓట్లు రావడంతో గెలుపు నిర్ణయించేందుకు అధికారులు టాస్ ఎంచుకున్నారు. కానీ అభ్యర్థులిద్దరూ ససేమిరా అనడమే కాక చెరో రెండున్నర ఏళ్లు సర్పంచ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపై తొలుత ఎవరు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాలనే అంశం తేల్చేందుకు టాస్ వేయగా మొదటి రెండున్నరేళ్ల అవకాశం బీఆర్‌ఎస్ అభ్యర్థి వీరస్వామికి దక్కింది.
మండలం జీపీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు
కూసుమంచి 41 28 12 00 00 01
నేలకొండపల్లి 32 20 07 02 00 03
తిరుమలాయపాలెం 40 23 10 02 00 05
ఖమ్మంరూరల్ 21 08 05 04 03 01
ముదిగొండ 25 18 02 05 00 00
కామేపల్లి 24 16 06 00 01 01
మొత్తం 183 113 42 13 04 11


