తుది విడతకు నేటితో తెర
● ఎన్నికల ప్రచారానికి కొద్దిగంటలే... ● చివరిరోజు అందరినీ కలిసేలా అభ్యర్థుల ప్రణాళిక
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో సోమవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియనుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఏకగ్రీవాలు, ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రచారం ముగిశాక కూడా ఓటర్లను మెప్పించేలా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
168 జీపీల్లో ఎన్నికలు
మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలు, 1,742 వార్డులు ఉన్నాయి. అయితే ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 22గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 1,742 వార్డులకు గాను తొమ్మిది వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి
పోటాపోటీగా..
బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామపంచాయతీల్లో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా తగ్గేదే..లే అన్న రీతిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి అనుబంధాలను గుర్తు చేస్తూ తమకు ఓటు వేయాలని సెంటిమెంట్‌తో అభ్యర్థిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. పోస్టర్లు, డోర్ స్టిక్కర్లపై తమ గుర్తు ముద్రించడమే కాక వాహనాల్లో మైకులు అమర్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తెరచాటు ప్రయత్నాలు
ఎన్నికల ప్రచారం గడువు సోమవారంతో ముగియనుంది. ఇన్నాళ్లు ఓట్లను రాబట్టుకునేలా ప్రచారాన్ని నమ్ముకోగా.. ఇకపై అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల్లోని వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే, సాధారణ ఎన్నికల స్థాయిలో డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న జీపీల్లో ఓటుకు రూ.వేయి, కొన్నిచోట్ల అంతకు మించి పంచేందుకు అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


