ప్రతిపాదనలు పంపించాం..
● భూ సర్వేకు సిద్ధమైన ప్రభుత్వం ● జిల్లాలో తొలివిడతగా 70 గ్రామాలు ఎంపిక
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత అంశాల్లో పారదర్శకత పెంచేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిగా మార్చారు. తాజాగా భూసమస్యల పరిష్కారానికి లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం.. సమగ్ర స్థాయిలో భూసర్వేకు నిర్ణయించింది. జిల్లా నుంచి 70గ్రామాల జాబితాను సమర్పించగా, ప్రభుత్వ అనుమతి లభించాక ఆయా గ్రామాల్లో సర్వే చేస్తారు. ఇందులో 2వేల ఎకరాల లోపు భూమి ఉన్న గ్రామాలను ఎంచుకున్నారు. తద్వారా సర్వే త్వరగా పూర్తవుతుందని.. ఆపై ఎదురయ్యే సమస్యల ఆధారంగా ముందుకు సాగొచ్చని భావిస్తున్నారు. కాగా, సర్వే అనంతరం భూమి వివరాలతో ప్రతీ రైతుకు భూ ఆధార్ కార్డు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఆధార్‌కార్డుల్లాగా భూమికి సంబంధించి సమస్త వివరాలతో భూ ఆధార్‌కార్డులు రూపొందించనున్నారు.
అందుబాటులోకి షేప్ ఫైల్స్
భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఎదురుకాకుండా ప్రభుత్వం డిజిటలైజేషన్ విధానాన్ని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా భూముల సర్వే అనంతరం హద్దులు, ఇతర వివరాలను ‘షేప్ ఫైల్స్’ పేరుతో భూభారతి సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. తద్వారా కొనుగోళ్లు, అమ్మకాల సమయాన ఎలాంటి కొర్రీలకు అవకాశం ఉండదని, ఎవరూ మార్చడానికి వీలుకాదని చెబుతున్నారు. ఇందులోనే ప్రభుత్వ భూముల వివరాలు కూడా నమోదు చేయనుండడంతో పట్టా భూమి, ప్రభుత్వ భూములు వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం హైవేలు, ఇతర అభివృద్ధి సేకరించిన సేకరించిన భూముల వివరాలను సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
మొబైల్ యాప్ ద్వారా...
భూముల సర్వే కోసం మొబైల్ యాప్ రూపొందించారు. గతంలో డ్రోన్లు, ఆ తర్వాత రోవర్స్ ద్వారా భూములను కొలిచేవారు. ప్రస్తుతం యాప్ ఉపయోగించాలని నిర్ణయించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడులో ఈ విధానం ద్వారా భూములు సర్వే చేస్తారు. ట్రాక్(తెలంగాణ రిమోట్ అప్లికేషన్ సెంటర్), ఎన్‌ఐసీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యాన ఈ సర్వే జరగనుంది.
భూ ఆధార్‌లో ఏమేం ఉంటాయంటే...
రైతులకు జారీ చేసే భూఆధార్ కార్డులో వివరాలన్నీ పొందుపరుస్తారు. యజమాని పేరు, విస్తీర్ణం, గ్రామం కోడ్, పేరు, మండలం, జిల్లా వివరాలతోపాటు భూ ఆధార్ నంబర్ ఉంటుంది. అలాగే, భూమి మ్యాప్, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా విస్తీర్ణం నమోదు చేస్తారు. ఇదే కార్డులో క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తారు. దీన్ని స్కాన్ చేయగానే భూయజమానులతో పాటు కొనుగోలు చేయాలనుకునే వారికి సమస్త వివరాలు తెలిసిపోతాయి.
భూముల సర్వే కోసం జిల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఇందులో 2 వేల ఎకరాల విస్తీర్ణంలోపు భూములు కలిగిన గ్రామాలను ఎంచుకున్నాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగానే సర్వే ప్రారంభిస్తాం.
– శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్,
ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్, ఖమ్మం
భూముల లెక్క.. పక్కాగా


