ఖమ్మం వ్యవసాయం/తిరుమలాయపాలెం: భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన రైతుల కష్టాలు తీరాయి. ఇన్నాళ్లు పట్టాదార్ పుస్తకం ఉన్న రైతులకే కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి అవకాశం ఉండేది. ఈ విధానంతో కౌలు రైతులు చేసేదేం లేక ప్రైవేట్ మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు. దీన్ని అరికట్టేలా ప్రభుత్వం కౌలు రైతుల రిజిస్టేషన్‌కు అవకాశం కల్పించింది. తద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ)లను భూ యజమాని పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డుతో కలిస్తే ఓటీపీ ఆధారంగా కౌలు రైతు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆపై కౌలు రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించుకునే అవకాశం లభిస్తోంది.
తిరుమలాయపాలెంలో 200మందికి...
తిరుమలాయపాలెం మండలంలోని 40 గ్రామపంచాయతీల పరిధిలో ఇప్పటి వరకు 200 మంది కౌలు రైతులకు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకానికి అవకాశం కల్పించినట్లు ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి తెలిపారు. మండలంలోని ఎదళ్లచెరువుకు చెందిన భూక్యా కరుణ పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేసింది. అయితే, సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకానికి అవకాశం లేక ఎటూ పాలుపోలేని పరిస్థితి ఎదుర్కొంటుండగా ఏఈఓల ద్వారా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్లు తెలిసింది. దీంతో రిజిస్ట్రేషన్ అనంతరం స్లాట్ బుక్ చేసుకుని ఈనెల 19న మద్దులపల్లి మార్కెట్ పరిధి భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో 28.80 క్వింటాళ్ల పత్తి విక్రయించింది. క్వింటాకు రూ.7,776.15 చొప్పున రూ.2,23,953.12 నగదు ఆమె ఖాతాలో జమ చేయనున్నట్లు మద్దులపల్లి మార్కెట్ కార్యదర్శి పి.వీరాంజనేయులు తక్ పట్టీ జారీ చేశారు. కాగా, కౌలు రైతులు పత్తి సాగు వివరాలను ఏఈఓల ద్వారా నమోదు చేయించుకొని సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించుకోవాలని, తద్వారా మద్దతు ధర దక్కుతుందని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీం తెలిపారు.
పత్తి అమ్మకానికి ఏఈఓల ద్వారా రిజిస్ట్రేషన్
కౌలు రైతుల తిప్పలు తప్పినట్లే


