గ్యారంటీ సమర్పించిన మిల్లులకే ధాన్యం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ నిబంధనలు పాటించే రైస్ మిల్లర్లకే జిల్లాలో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయిస్తామని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై రైస్‌మిల్లర్లు, అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని 71 మిల్లుల్లో 63 మిల్లుల నుంచే బ్యాంకు గ్యారంటీలు అందినందున మిగిలిన మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఉండవని చెప్పారు. ఆయా మిల్లర్లు పెండింగ్ ఉన్న బియ్యం అందించి, బ్యాంక్ గ్యారంటీలు ఇస్తే ధాన్యం కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ఖరీఫ్‌లో ధాన్యం తీసుకునే ప్రతీ రైస్ మిల్లర్ యాసంగిలోనూ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే, నిల్వ సామర్ధ్యాన్ని పెంచేలా నూతన గోదాంలు నిర్మిస్తామని తెలిపారు. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు మాట్లాడుతూ స్థలాభావంతో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నందున రవాణా ఖర్చులు చెల్లించాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


