ముంపునకు చెక్ పెట్టేలా..
మున్నేటికి అదనంగా రిటైనింగ్ వాల్... ఆపై డ్రెయిన్ల నిర్మాణం
రూ.250 కోట్లతో ప్రతిపాదించిన
జల వనరుల శాఖ
సెంట్రల్ డిజైన్ కమిటీ అనుమతిస్తే పనులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంతో పాటు రూరల్ మండలంలోని కాలనీలను మున్నేటి వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగం పుంజుకున్నాయి. రెండు వైపులా 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణంతోపాటు అనుబంధంగా డ్రెయిన్లు, రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ.690 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత ఏడాది నుంచి రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు చేపడుతుండగా, భూసేకరణ సమస్య లేని ప్రాంతాల్లో ఇప్పటికే రూ.200 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈనేపథ్యాన వాల్‌ను ఆనుకుని నగరం నుంచి వచ్చే వరద మున్నేటికి పోటెత్తకుండా ముందుకు సాగేలా అవసరమైన డ్రెయిన్ నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే సెంట్రల్ డిజైన్ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించగా ఆమోదం తెలిపితే వెంటనే డ్రెయిన్ల నిర్మాణం మొదలుకానుంది. మొత్తం రూ.690 కోట్ల నిధుల్లోనే రిటైనింగ్ వాల్‌కు అనుబంధంగా డ్రెయిన్ల నిర్మాణానికి రూ.250 కోట్లకు పైగా వెచ్చించేలా అంచనాల్లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు.
అర్బన్ – రూరల్ వైపు వేర్వేరుగా..
ఖమ్మం కార్పొరేషన్ వైపు ఆరు మీటర్ల వెడల్పుతో డ్రెయిన్ నిర్మాణం మొదలుపెట్టి ప్రకాశ్‌నగర్ వద్ద సుమారు 25 మీటర్ల వెడల్పుతో చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఖమ్మం రూరల్ మండలం వైపు ప్రారంభంలో 10 మీటర్ల వెడల్పుతో మొదలై చివరకు 34 మీటర్లుగా ముగియనుంది. అయితే, డ్రెయిన్ల నిర్మాణం ప్రారంభించాలంటే సెంట్రల్ డిజైన్ కమిటీ ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రతిపాదనలు సమర్పించారు.
వాల్.. మరింత పొడవుగా
మున్నేటి వరద నగరంతో పాటు ఖమ్మం రూరల్ వైపు కాలనీల్లో ముంచెత్తకుండా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్‌కు అనుబంధంగా ప్రకాశ్‌నగర్ నుంచి ధంసలాపురం వద్ద ఉన్న నేషనల్ హైవే వంతెన వరకు అదనంగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సిద్ధమయ్యా రు. వాల్‌తో పాటు డ్రెయిన్ల నిర్మాణానికి మంత్రుల సూచనలతో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం అర్బన్ వైపు సుమారు 5.7కి.మీ. డ్రెయి న్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవల మున్నేటికి వరద వచ్చినప్పుడు ధంసలా పురం వద్ద ఉన్న కాలనీ మొత్తం మునిగింది. అక్కడ వాల్ నిర్మాణం చేపట్టకపోతే ప్రతీసారి ఇదే పరిస్థితి ఎదురవుతుందనే భావనతో రిటైనింగ్ వాల్ పొడిగింపునకు నిర్ణయించారు. ఇక ఖమ్మం రూరల్ వైపు కూడా అంచనాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.
చెరువుల అభివృద్ధికి రూ.65 కోట్లతో...
జిల్లా కేంద్రంలోని మూడు చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.65 కోట్లతో అధికారులు అంచనాలను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆపై అందిన సూచనలతో కొన్ని మార్పులు చేసి పంపినట్లు తెలిసింది. వీటితో పాటు రిటైనింగ్ వాల్ పొడిగింపు, డ్రెయిన్ల నిర్మాణానికి ఆమోదం లభిస్తే మున్నేటికీ పరీవాహక ప్రజలకు ముంపు బాధ నుంచి శాశ్వత విముక్తి లభించనుంది.
ముంపునకు చెక్ పెట్టేలా..


