అందరి సహకారంతోనే ‘భద్రాద్రి’ అభివృద్ధి
ఖమ్మంగాంధీచౌక్: డిపాజిట్‌దారులు, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది సహకారంతోనే భద్రాద్రి బ్యాంకు అభివృద్ధి పథంలో పయనిస్తోందని చైర్మన్ చెరుకూరి కృష్ణమూరి తెలిపారు. అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం ‘ప్రపంచ పోటీతత్వం కోసం సహకార వ్యాపార నమూనాల ఆవిష్కరణ’అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. సహకార వ్యవస్థకు 120 ఏళ్ల చరిత్ర ఉందని, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడిందన్నారు. భద్రాద్రి బ్యాంకు 1997లో ఒక శాఖగా ఏర్పడితే ఇప్పుడు 23 శాఖలు ఉన్నాయని తెలిపారు. జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జి.ఉషశ్రీ, ఎం.శృతి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక మార్పులను సహకార బ్యాంకులు అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు సేవలందిస్తున్నాయని చెప్పారు. బ్యాంకు సీఈఓ దాసరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. త్వరలోనే సిద్దిపేట, హైదరాబాద్ హయత్‌నగర్‌లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రిజర్వ్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తేజడిప్త టెహెరా మాట్లాడగా, బ్యాంకు డైరెక్టర్ పి.చెన్‌సింగ్, మేనేజర్లు, సభ్యులు పాల్గొన్నారు.


